గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఏం జరిగిందో కానీ.. అక్కడ చదువుకుంటున్న ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంపై మరక వేసేశారు. సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి న్యూడ్ వీడియో తీసి అమ్ముకున్నారన్న ప్రచారం ప్రారంభించేశారు. నిజానికి అక్కడ ఒక్కటంటే ఒక్క సీక్రెట్ కెమెరానూ కనిపెట్టలేదు. అలాగే.. కాలేజీ విద్యార్థులు… అనుమానితుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు మొత్తం జల్లెడపట్టినా ఒక్క వీడియో కూడా లేదు. పోలీసులు ఇదే విషయాన్ని ప్రకటించి ఎవరూ భయపడవద్దని ప్రకటించారు.
కానీ విద్యార్థుల రూపంలో కొంత మంది.. రాజకీయం కోసం మరికొంత మంది.. సీక్రెట్ కెమెరాలతో రికార్డు చేసేశారని.. ప్రచారం చేశారు. దీని వల్ల ఎవరికి నష్టం ?. గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్క ఆడపిల్ల మానసిక క్షోభ అనుభవించాల్సిందే. వారి జీవితాలపై అదో మరకగా పడిపోతుంది. డిజిటల్ ప్రపంచంలో ఫేక్ వీడియోలు ఎంత ప్రమాదకరంగా మారాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వారంతా ఈ మహమ్మారి బారిన పడాల్సి వస్తుంది.
కాలేజీ రోజుల్లో చాలా పనులు విద్యార్థులు చేస్తారు. పెద్దగా పర్యవేక్షణ ఉండని కాలేజీల్లో ఇంకా ఎక్కువ జరుగుతాయి. అలాంటివి వారి భవిష్యత్ జీవితాలను నాశనం చేయకుండా.. ఎక్కడిక్కడ పరిష్కారం చేయాలి.. దారి తప్పే విద్యార్థులను కట్టడి చేయాలి. కానీ తమ భవిష్యత్ గురించి ఆలోచించకుండా.. రాజకీయం చేస్తున్నారని తెలిసి కూడా ఆ విద్యార్థులు రోడ్డున పడితే వాళ్లకే నష్టం. ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు అదే జరిగింది. తప్పు చేసిన వారు నలుగురు ఐదుగురే.. అది వారి వ్యక్తిగత వ్యవహారశైలి వల్ల వచ్చింది. కానీ చేసిన ప్రచారం మాత్రం అందరి విద్యార్థుల జీవితాలను రిస్క్ లో పెడుతోంది.
శవాల మీద రాజకీయం చేయడానికి ఎదురుచూసే పార్టీలు ఉన్న రోజుల్లో.. విద్యార్థుల భవిష్యత్ ను.. వ్యక్తిత్వాలను పణంగా పెట్టడానికి పెద్దగా ఆలోచించవు. తాము బలి పశువులం కావాలా.. భవిష్యత్‌ను కాపాడుకోవాలా అన్నదే విద్యార్థుల విచక్షణ.