హీరోయిన్ జత్వానీ మాయ లేడీ అంటూ వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారు. మహిళలతో శృంగార వస్తువులుగా చూస్తూ అడ్డగోలుగా పలుమార్లు దొరికిపోయిన అంబటి రాంబాబే ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అసలు కుట్రలో భాగమైన కుక్కల విద్యాసాగర్ .. సాక్షిలో ఇంటర్యూ ఇచ్చి 2019నుంచి జత్వానీ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని చెప్పుకొచ్చారు. మరి ఆ విషయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు కదా.. ఐదేళ్ల తర్వాత తప్పుడుకేసులు పెట్టడం ఎందుకు అన్నది మాత్రం.. నోరు మెదపడం లేదు.
ఇప్పుడు జెత్వానీ వ్యక్తిత్వం మీద…ఆమె ఎలాంటిది అన్నదాని మీద ఎవరి సర్టిఫికెట్లు ఆమెకే కాదు ఎవరికీ అవసరం లేదు. ఆమెపై తప్పుడు కేసులు పెట్టి ..తీసుకొచ్చి ఆమె కుటుంబాన్ని వేధించారా లేదా అన్నదే ఇక్కడ సమస్య. జగ్గయ్యపేటలో పొలం గురించి మోసం చేశారని కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుచేశారు. అదంతా ఫేక్ ఫిర్యాదు అని తేలిపోయింది. అందులో ఐదు లక్షలు డబ్బులిచ్చినట్లుగా చెబుతున్న వారు కూడా.. తమకేం తెలియదని.. కుక్కల విద్యాసాగర్ కుట్ర చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే… జత్వానీని టార్గెట్ చేయడానికి… ఓ పెద్ద మాఫియా నెట్ వర్క్ లాగా ఏర్పడి తప్పుడు ఫిర్యాదులతో.. ఆమెను.. ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకొచ్చి చేయాల్సిందంతా చేశారు. అసలు నేరం ఇది.
జత్వానీపై నిందలేసి.. ఆమెకు అలా చేయడం కరెక్టే అని వాదిస్తే అంతకు మించిన బరితెగింపు తనం ఇంకేమీ ఉండదు. రేపు వారిపైనా అలాంటి నిందలేసి చేయాల్సిన పనులు చేసేయవచ్చు. వైసీపీ నేతల వ్యవహారశైలి.. వారి ఎదురుదాడి మొదటి నుంచి ఇలాగే ఉంటుంది. తాము చేసిన తప్పును.. ఇతరులు చేయేలేదా.. వారేమైనా సుద్దపూసలా అంటూ ఎదుటివారిపై బురదచల్లి తాము తప్పించుకుంటారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఓ మహిళపై అత్యంత ఘోరమైన నిందలేసి తాము చేసిన తప్పుడు పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత కన్నా దిగజారుడుతనం ఇంకేమీ ఉండదు.