“ఆడపిల్లల జీవితాలను అతలాకుతలం చేసే ఘటనపై సర్కార్ కఠిన చర్యలు చేపట్టాలి” గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై వైసీపీ అధినేత జగన్ రియాక్షన్ ఇది. ఆడపిల్లల భద్రత విషయంలో సర్కార్ సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలని డిమాండ్ చేసిన జగన్..బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వాని విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారు..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
గత మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో కాదంబరీ జెత్వాని ఎపిసోడ్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో జెత్వానిపై ఐపీఎస్ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని, ఆమె కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని ఆమె వాపోయింది. పోలీసులు కిడ్నాప్ చేసి , 40 రోజులపాటు బంధించి చిత్రహింసలకు గురి చేశారని, నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైంది.
అయితే, ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు ఖండించేందుకు ముందుకు రావడం లేదు. ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఈ అంశంపై స్పందించలేదు.. కానీ, గుడ్లవల్లేరు ఘటనపై మాత్రం వెంటనే ఎక్స్ వేదికగా స్పందించేశారు. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో బాధితులు అమ్మాయిలే.. అదే సమయంలో ఇక్కడ ఐపీఎస్ అధికారుల చిత్రహింసలకు గురై బాధితురాలుగా నిలిచింది అమ్మాయే..
అమ్మాయిలకు భద్రత కల్పించాలని కామెంట్స్ చేస్తోన్న జగన్..జెత్వాని విషయంలో మాత్రం న్యాయం చేయాలని డిమాండ్ చేయకపోవడం పట్ల ఇప్పుడు చర్చ జరుగుతోంది.