భాగ్యనగర వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈమేరకు నగరంలో రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని..అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని సూచించింది.
మరోవైపు శనివారం తెల్లవారుజాము నుంచే నగరం అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. ఇప్పుడు మరో రెండు గంటల్లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల కాలనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
హైదరాబాద్ కు భారీ వర్ష సూచనతో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది.