kandahar hijack web series review
ప్రపంచమంతా 2000 మిలీనియంలోకి అడుగుపెట్టాలనే సంబరంలో వున్న సమయంలో భారతదేశం మాత్రం ఓ పెను సవాల్ ని ఎదుర్కొంది. మన దేశంపై ఉగ్రవాదం పంజా విసిరింది. డిసెంబర్ 24,1999లో కాఠ్మాండు నుంచి దిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814’ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఇండియన్ ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ ఇది. ఇప్పుడీ ఘటన ఆధారంగా నెట్ ఫ్లిక్స్ లో ‘ఐసీ 814 కాంధార్ హైజాక్ ‘ వెబ్ సిరిస్ రిలీజైయింది. కెప్టెన్ దేవిశరణ్, శ్రింజయ్ చౌదరి రాసిన ‘ఫ్లైట్ ఇన్‌టూ ఫియర్’ పుస్తకానికి దర్శకుడు అనుభవ్ సిన్హా ఇచ్చిన దృశ్య రూపం ఎలా వుంది?
176 మంది ప్రయాణికులతో కాఠ్మాండు నుంచి దిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814’ విమానాన్ని ఓ నలుగురు ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. ప్రయాణీకుల్ని బందీలుగా చేసిన ఉగ్రవాదులు, కెప్టన్ శరన్ దేవ్ (విజయ్ వర్మ) పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి విమానాన్ని కాబూల్ తీసుకెళ్లమని బెదిరిస్తారు. అప్పుడు కెప్టన్ ఏం చేశాడు? ఆ విమానం కాబూల్ చేరిందా? ఉగ్రవాదులు ఎందుకు విమానాన్ని హైజాక్ చేశారు? వారి డిమాండ్స్ ఏమిటి? భారత ప్రభుత్వం ఈ ఉగ్రచర్యని ఎలా ఎదురుకుంది? ప్రయాణికులు ఉగ్రవాదుల చెర నుంచి ఎలా బయటపడ్డారనే మిగతా సిరిస్.
ఏవియేషన్ చరిత్రలో కాంధార్ హైజాక్ చాలా సంచలనమైనది. దాదాపు వారం రోజులు పాటు ప్రయాణికుల్ని బందీలుగా వుంచారు ఉగ్రవాదాలు. సాధారణంగా హైజాక్ చేసిన తర్వాత ఉగ్రవాదాలు తమ డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు ఉంచుతారు. కానీ ఈ హైజాక్ లో ఐదో రోజు వరకూ అసలు ఉగ్రవాదులు తమకు ఏం కావాలో స్పష్టంగా చెప్పలేదు. అలాగే విమానాన్ని లాహోర్, దుబాయ్, చివరికి ఆఫ్గానిస్తాన్.. ఇలా దేశాలు మారుస్తూ క్షణం క్షణం నరకం చూపించారు. ఈ సమాచారం అంతా ఆర్టికల్స్, న్యూస్ రూపంలో అందుబాటులో వుంది. దీనికి ఒక వీడియో డాక్యుమెంటేషన్ లా కాంధార్ హైజాక్ ని తీర్చిదిద్దాడు దర్శకుడు.
యదార్ధ సంఘటనకు సినిమాటిక్ లిబార్టీ ఇచ్చి ప్రేక్షకుడిని కట్టిపడేసి స్క్రీన్ ప్లేతో తీయడం ఒక పద్దతి. అలా కాకుండా వున్నది వున్నట్లుగా చూపించి చరిత్రని నిక్షిప్తం చేయడం మరో పద్దతి. దర్శకుడు ఈ రెండో పద్దతిని ఎంచుకున్నాడు. లీనియర్ స్క్రీన్ ప్లేతో అందుబాటులో వున్న సమాచారాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. అందుకే ఇందులో ప్రొసీడింగ్స్ నింపాదిగా వుంటాయి. ఆరు ఎపిసోడ్స్ ల సిరిస్ ఇది. ఒకొక్క ఎపిసోడ్ నిడివి 40నిముషాలు పైనే. విమానం కాఠ్మాండు నుంచి దిల్లీకి బయలుదేరే సన్నివేశంతో సిరిస్ మొదలౌతుంది. ఉగ్రవాదులని చూపించిన తీరు, హైజాక్ చేసిన విధానాన్ని సాదాసీదాగానే చిత్రీకరించారు. మొదటి రెండు ఎపిసోడ్స్ లో అంత సీరియస్ నెస్ కనిపించదు. విమానం లోహోర్ లో ల్యాండ్ చేసిన సీక్వెన్స్ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా తీశారు.
సిరిస్ ముందుకు సాగుతున్న కొద్ది దేశ రక్షణ వ్యవస్థ, ఇండియా- పాక్ మధ్య సంబంధాలు, అల్‌ఖైదా గ్రూప్స్ నేపధ్యాలు వాయిస్ నేరేషన్ లో వినిపిస్తాయి. వీటన్నటిపై ఎంతోకొంత అవగాహన వున్న ప్రేక్షకుడికి .. ఈ హైజాక్, ఆనాటి పరిస్థితులు ఇంకాస్త లోతుగా అర్ధమౌతాయి. చివరి రెండు ఎపిసోడ్స్ గ్రిప్పింగ్ గా తీశారు. భారత అధికారులు కాంధార్ చర్చలకు చేరుకున్న తర్వాత వచ్చే సన్నివేశాలు, ఉగ్రవాదుల డిమాండ్స్, రాజకీయ ఒత్తిళ్ళు, ఇండియన్ బ్యూరోక్రసీ చూపిన చొరవ ఇవన్నీ సహజంగా చూపించారు. హైజాకర్స్ కి సాయం చేసిన వారిలో ఉసామా బిన్ లాడెన్, దావూద్ వున్నారనే ఓ కథనం వుంది. ఇందులో కూడా ఆ ప్రస్తావన వుంది. ఉగ్రవాదుల డిమాండ్స్ ని అంగీకరించడంలో ప్రభుత్వాలు ఎందకు అంతగా అలోచిస్తాయి అనే కోణం చివరి ఎపిసోడ్ లో టైటిల్ కార్డ్స్ లో వేశారు. ఒక ఉగ్రవాదిని వదిలేస్తే తను ఎన్ని విద్వంసాలు సృష్టిస్తాడో, ఎన్ని మారణహోమాలకు కారణమౌతాడో ఈ హైజాకే సాక్షంగా నిలిచింది.
నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, విజయ్ వర్మ, అరవింద్ స్వామి, కుముద్ మిశ్రా, దిబ్యేందు భట్టాచార్య .. ఇలా ప్రముఖ తారాగణం వుంది. వీళ్ళంతా పాత్రల్లో దూరిపోయే నటులే. అయితే ఇందులో ప్రత్యేకంగా ఒక పాత్ర అంటూ చెప్పడానికి ఏమీ లేదు. అందరూ పాత్ర పరిధిమేరకు అన్నట్టుగా కనిపిస్తారు. విజయ్ వర్మ మాత్రం చాలా సెటిల్డ్ గా చేశారు. మిగతా అందరూ పంక్తు బ్యూరోక్రాట్స్ అనిపించేలా కనిపించారు. దియా మీర్జా ట్రాక్ మాత్రం అంతగా అతకలేదు. నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. కెమరా వర్క్ లో వింటేజ్ మూడ్ ని క్రియేట్ చేశారు. ఆనాటి వీడియోలు కూడా అందుబాటులో వుండటంతో వాటిని మ్యాచ్ చేస్తూ చక్కగా తీశారు. నేపధ్య సంగీతం డీసెంట్ గా వుంది.
ఒక థ్రిల్లింగ్ హైజాక్ కంటెంట్ చూడాలని ఈ సిరిస్ మొదలుపెడితే మాత్రం నిరాశ పడే అవకాశం ఎక్కువ. అలా కాకుండా అసలు ఏమిటీ కాంధార్ హైజాక్ అని తెలుసుకోవాలనే ఆసక్తితో చూస్తే మాత్రం ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ ని చూసిన అనుభూతిని ఇస్తుంది.
– అన్వర్