వైసీపీ అధికారం కోల్పోయాక కూడా జగన్ తో డీ అంటే డీ అంటున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అవకాశం వస్తే జగన్ పై తగ్గేదేలే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ రెడ్డి – షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం నడుస్తోంది. ఈ సమయంలోనే జగన్ – షర్మిల ఒకే వేదికపై కనిపించబోతున్నారని కాంగ్రెస్ – వైసీపీ వర్గాలు ఈ ఆసక్తికర సన్నివేశం కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి.
నేడు వైఎస్సార్ వర్ధంతి కావడంతో జగన్ – షర్మిల ఒకే వేదికపై కనిపిస్తారని అనుకున్నారు..అన్నా, చెల్లెళ్ళ మధ్య విబేధాలు ముదరడం, వైసీపీ అధికారం కోల్పోవడానికి షర్మిల ఓ కారణమని జగన్ ఆగ్రహంగా ఉన్నారన్న ప్రచారంతో ఇద్దరూ ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ ఏడాది వైసీపీ అధికారం కోల్పోయాక జులై ఎనిమిదిన జరిగిన వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇద్దరూ ఒకే వేదికపై కనిపించినా పలకరించుకున్నది లేదు.. అదే టెంపొను కొనసాగిస్తూ జగన్ టార్గెట్ గా షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అచ్యుతాపురం ఘటనకు జగన్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించింది. వైసీపీకి మనుగడ లేదని, విలీనం కావాల్సిందేనని జగన్ ప్లేసును ఆక్రమించేలా రాజకీయం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే జగన్ – షర్మిల ఒకే ఫ్రేంలో కనిపిస్తే ఎలా ఉంటుంది..? పలకరించుకుంటారా? గతంలో మాదిరి ఎడమొహం, పెడమొహంగానే ఉంటారా? అనే పులివెందుల పొలిటికల్ సర్కిల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే వైఎస్ విజయమ్మతో కలిసి ఇడుపులపాయకు వెళ్ళారు జగన్. అయితే, గతంలో ఒకేసారి తండ్రికి నివాళులు అర్పించిన జగన్ – షర్మిలలు ఈసారి మాత్రం వేర్వేరుగా నివాళులు ఆర్పించడం పట్ల చర్చ జరుగుతోంది.
జగన్ తో ఎదురెదురు పడకూడదని భావించే షర్మిల.. జగన్ వెళ్లి వచ్చిన అనంతరం వైఎస్సార్ ఘాట్ కు వెళ్లి నివాళులు ఆర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.