నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల్లో చిరంజీవి మాటలు ఆసక్తిని రేపాయి. ‘ఇంద్ర’ సినిమా చేయడానికి స్ఫూర్తి ‘సమరసింహారెడ్డి’ అని నిర్మొహమాటంగా చెప్పిన చిరు.. ‘ఇంద్రసేనా రెడ్డినీ సమరసింహారెడ్డిని కలిపి ఓ కథ రాయొచ్చు కదా’ అంటూ దర్శకులకు ఛాలెంజ్ విసిరారు. ఆ సమయంలో అక్కడ చాలామంది దర్శకులే ఉన్నారు. అయితే బోయపాటి శ్రీనులోని ఉత్సాహం గమనించిన చిరు… ‘ఏం బోయపాటి.. నువ్వు రెడీనా’ అంటూ ప్రత్యేకంగా బోయపాటి పేరు ప్రస్తావించడం మరింత ఆసక్తిని రేపింది. బోయపాటికి యాక్షన్ సినిమాలు తీయడం నల్లేరుపై నడక. పైగా బాలయ్యతో ఆయన అద్భుతాలు సృష్టించారు. చిరంజీవితో ఓ సినిమా చేయాలని బోయపాటి ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. చిరు – బాలయ్యలను ఒకే ఫ్రేమలోకి తీసుకొచ్చే అద్భుతమైన అవకాశం దక్కితే ‘నో’ ఎలా చెబుతాడు?
పైగా చిరు ఆలోచన విభిన్నమైనది. రెండు వేర్వేరు సినిమాలు, రెండు వేర్వేరు పాత్రలు, ఇద్దరు వేర్వేరు హీరోల్ని ఒక సినిమాతో, ఒక కథతో కలపడం మంచి ఐడియా. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ చేస్తున్న యూనివర్స్ థాట్ లాంటిదే. సమర సింహారెడ్డి, ఇంద్రసేనా రెడ్డి ఒకే మిషన్ లో కలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వందల కోట్ల విలువైనది. కానీ దాన్ని హ్యాండిల్ చేసేంత శక్తిమంతమైన కథ తయారవ్వాలి. బోయపాటి లాంటి దర్శకుడు తలచుకొంటే అదేమంత కష్టమైన విద్య కాదు. చిరంజీవి విసిరిన ఛాలెంజ్.. బోయపాటి స్వీకరిస్తే ఓ అద్భుతమైన మల్టీస్టారర్ చూసే అవకాశం, అదృష్టం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుంది. ఇప్పుడు బంతి బోయపాటి కోర్టులోనే.