ప్రభుత్వంపై పోరాటంలో సోషల్ మీడియా కీలకమే. అయితే ఫేక్ న్యూసులు వేసుకుని.. ఫ్యాన్ వార్స్ చేసుకుని.. తమను ప్రశ్నిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తే అదే సోషల్ మీడియా అనుకునే మైండ్ సెట్ లోకి బీఆర్ఎస్ సోషల్ మీడియా వెళ్లిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేక….. కిందా మీదా పడుతోంది. అనవసరమైన విషయాల మీద సమయం వృధా చేసుకుని. అదే గొప్ప అనుకునే పరిస్థితికి వచ్చారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ గా క్రిషాంక్ ఉన్నారు. సోమవారం స్కూళ్లకు సెలవు అని ప్రభుత్వం తరపున మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఇది క్రిషాంక్ నచ్చలేదు. రెవిన్యూ మంత్రి విద్యాశాఖ గురించి ప్రకటించడం వింతగా అనిపించి దాన్ని పోస్టు పెట్టారు. కానీ గత ప్రభుత్వంలో ఏ శాఖ మంత్రి ఏ పని చేశారో.. అందరూ ప్రశ్నిస్తారన్న సంగతిని మార్చిపోయారు. సకల శాఖలకు కేటీఆరే మంత్రి. అన్నీ ఆయనే చేసేవారు. మంత్రులకు కనీస స్వేచ్చ ఉండదు. విపత్తుల్లో స్పందించాలన్నా… మేలుకున్న తర్వాత గుర్తుకు వస్తే ప్రకటించేవారు. గత ఏడాది వర్షాలప్పుడు స్కూల్స్ స్టార్టయిపోయాక సెలవులు ప్రకటించడం … అప్పట్లో ట్రోలింగ్ కు గురయింది. దాన్ని గుర్తు చేసుకున్న వారిపైనా .. క్రిషాంక్ తప్పు పట్టే ప్రయత్నం చేశారు.
అసలు సమస్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎప్పుడో మర్చిపోయి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో ఫ్యాన్ వార్స్ కు దిగుతోంది. కవిత బెయిల్ వచ్చినప్పుడు… చంద్రబాబును విషయాన్ని ప్రస్తావించుకుని రచ్చ చేసుకున్నారు. పార్టీ అధినేతల్ని తిట్టిస్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సోషల్ మీడియా బాధ్యత ఎక్కువ ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మానసిక తృప్తి కోసం సోషల్‌మీడియాను నడుపుకుంటే బీఆర్ఎస్ లాగే అవుతుంది. అసలు బీఆర్ఎస్ కోసం.. ఆ పార్టీ సోషల్ మీడియా ఏం చేస్తుందో వారే ఆలోచించుకుంటే ఆ విషయం అర్థమవుతుంది.