ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల తీరు తీవ్ర విమర్శల పాలు అవుతోంది. ఒకే జిల్లా నుంచి ఓ డిప్యూటీ సీఎంతో సహా కీలక శాఖలకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నా వరదల్లో చిక్కుకున్న ఆరుగురుని రక్షించడంలో నిర్లక్ష్యం వహించారని ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపినా.. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో మీనమేషాలు లెక్కించారని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మంత్రుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం ఫలితంగా ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులతో సహా 10 మంది వరద నీటిలో చిక్కుకున్నారు.
ఫోన్ చేసి తమ దుస్థితిని బాధితురాలు వివరించినా.. వారిని రెస్క్యూ చేయడంలో ఆలస్యం ప్రదర్శించారని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్కార్ పై పెదవి విరుపులు మొదలు అయ్యాయి. వారిని సేఫ్ చేసేందుకు విశాఖ నుంచి హెలికాప్టర్ ను రంగంలోకి దించేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యం కావడం.. వాతావరణం ప్రతికూల ప్రభావం చూపడంతో రెస్క్యూ చేయడానికి వీలు కాలేదు.
ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ తమదైన ముద్ర వేసిన ఈ ముగ్గురు మంత్రులు.. ఈ ఘటన ద్వారా విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మరికాసేపట్లో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం రేవంత్ రెడ్డి బయల్దేరి వెళ్లనున్నారు.