అమరావతిపై ఎన్నెన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. అన్నీ తేలిపోయాయి. అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయారు. అయినా అధికారంపోయిన తర్వాత బురదచల్లడం మాత్రం ఆపలేదు. అమరావతి మునిగిపోయిందని అదే పనిగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు సహాయ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి?. విజయవాడలో బుడమేరు ముంపు ఉన్నప్రాంతాల్లో మాత్రమే జరుగుతున్నాయి. బెజవాడ మొత్తం కూడా ముంపులో లేదు.
అమరావతిలో అయితే ఎక్కడా ముంపు అనే సమస్య లేదు. కొండవీటి వాగు నుంచి వచ్చిన నీళ్లను వచ్చినట్లుగా తోడేసే పంపింగ్ స్టేషన్ ను చంద్రబాబు ఎప్పుడో నిర్మించారు. దాంతో నీళ్లన్నింటినీ కృష్ణాలోకి ఎత్తిపోసేశారు. వర్షాలు ఆగిపోయిన మరుక్షణం అమరావతిలో చుక్క నీరు ఎక్కడా నిల్వ లేదు. పొలాల్లో కూడా ఇంకిపోయింది. సెక్రటేరియట్ దగ్గర లేదు.. హైకోర్టు దగ్గర లేదు.. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ దగ్గర లేదు.
అమరావతి ప్రాంత రైతులు, యువత ఎప్పటికప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైసీపీ నేతల కుట్ర తేలిపోయింది. తెలంగాణలో ఉన్న కొంత మంది కూడా అమరావతి పై అకారణ ద్వేషం పెంచుకుని అదే పనిగా తప్పుడు ప్రచారం చేశారు. అమరావతి వల్ల వారికి ఏమి నష్టం జరుగుతుందో అలాంటి వారు ప్రశ్నించుకుంటే మంచిది. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉంది . ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఓ భయంకరమైన సునామీ నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉంది. ప్రకృతి సిద్ధమైన సవాళ్లు వచ్చినప్పుడు ప్రజలకు ఓ చేయి అందించాలి కానీ… వారి నెత్తి మీద బండలు వేయకూడదు. కానీ అమరావతి విషయంలో కొంత మంది అదే పని చేసే ప్రయత్నం చేశారు.