వైసీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు అయింది. పలువురు వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ , టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలశిల రఘురాం, అప్పిరెడ్డి ,నందిగం సురేష్, దేవినేని అవినాష్ సహ ఇతర నేతల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.
ఈ బెయిల్ పిటిషన్ల తిరస్కరణతో పిటిషనర్ తరఫు న్యాయవాదులు.. రెండు వారాలపాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును అభ్యర్థించారు. అయితే, ఇప్పటికప్పుడు ఈ అంశంపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, దీనిపై విచారణ జరిపే అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
టీడీపీ అధినేత చందబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ను ఇప్పటికే పోలీసులు విచారించారు. అప్పట్లోనే ఆయనను అరెస్ట్ కూడా చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు కొద్దిరోజుల పాటూ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వుల్ని ఇవ్వడంతో అరెస్టుకు బ్రేక్ పడింది.
తాజాగా జోగి రమేష్ తోపాటు పలువురు వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో మధ్యాహ్నం తర్వాత వైసీపీ నేతల అరెస్ట్ పై పూర్తి స్పష్టత రానుంది.