భారీ వర్షాలకు, పోటెత్తుతున్న వరదలకు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నాశనమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాలు ఎడతెరపి లేకుండా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. చిత్రసీమ నుంచి కూడా సహాయం అందుతోంది. ఇప్పటికే చాలామంది కథానాయకులు తమ విరాళాలు ప్రకటించారు. ఈరోజు కూడా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ప్రభాస్ పెద్ద మనసు చేసుకొని, రూ.2 కోట్లు (ఒకొక్క రాష్ట్రానికి కోటి) విరాళం అందించారు. అల్లు అర్జున్ తన వంతు సాయంగా రూ.1 కోటి ప్రకటించారు. ఇదే దారిలో దర్శకులు, నిర్మాతలూ తమకు తోచినంత సహాయం అందిస్తున్నారు.
* కథానాయికలేరీ?!
అయితే ఈ జాబితాలో కథానాయికల పేర్లు కనిపించకపోవడం విచిత్రంగా ఉంది. ఈమధ్య కథానాయికలూ భారీ పారితోషికాలు అందుకొంటున్నారు. ఒక్కో సినిమాకూ రూ.3 కోట్లు తీసుకొంటున్నవాళ్లు ఉన్నారు. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ యేడాదికి కోట్లాది రూపాయల బ్యాంకు బాలెన్సులు పెంచుకొంటున్నవాళ్లు ఉన్నారు. ‘ఐ లవ్ తెల్గూ పీపుల్’ అంటూ ప్రేమాభిమానాలు కురిపించే కథానాయికలు, ఇలాంటి ప్రకృతి విపత్తు సమయాల్లోనూ తమ ప్రేమ చాటుకొంటే బాగుంటుందన్నది అందరి అభిప్రాయం.