మావోయిస్టుల వైపు నుంచి మీడియాకు సమాచారం ఇచ్చే.. మావోయిస్టుల అగ్రనేత జగన్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఛత్తీస్‌గఢ్ లో రెండు రోజులకిందట భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అందులో పలువురు మావోయిస్టులు చనిపోయారు. వారిని గుర్తించే క్రమంలో.. జగన్ కూడా చనిపోయినట్లుగా తేలింది. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఇంఛార్జ్‌గా ఉన్న జగన్.. మావోయిస్టుల వాదనను.. హెచ్చరికల్ని మీడియాకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారు.
జగన్ అసలు పేరు ఏసోబు. ఆయన చర్చి పాస్టర్ గా ఉండేవారు. ఉద్యమానికి ఆకర్షితులై అడవుల్లోకి వెళ్లారు. చాలా కాలం పని చేశారు. ఏసోబ్ హనుమకొండ జిల్లా వాసి. ఇప్పుడు ఆయన మృతి సమాచారం కూడా… పోలీసులు చెప్పారు. ఇంకా మావోయిస్టు ప్రకటించలేదు. మావోయిస్టుల తరపున ఏదైనా ఘటన జరిగితే ఆయనే స్పందించాల్సి ఉంది. ఏసోబ్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది.
మావోయిస్టుల ప్రభావం రాను రాను తగ్గిపోతోంది. దళాల్లో కొత్తగా చేరేవారు ఎవరూ ఉండటం లేదు. సీనియర్లు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతాల్లో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఇటీవలి కాలంలో అక్కడ బలగాలు పట్టు బిగిస్తున్నాయి. ఏవోబీలో కూడా కదలికలు తక్కువగా ఉన్నాయి. త్వరలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా.. చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాలు, ఏవోబీని చూడాలని కేంద్రం పట్టుదలగా ఉంది.