తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చించడానికి స్పీకర్ కోడెల శివప్రసాద రావు అనుమతించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో, ప్రజా సమస్యల పరిష్కారించడంలో తెదేపా ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమయింది కనుక దానిపై ప్రజలు కూడా విశ్వాసం కోల్పోయినందునే తాము అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు వైకాపా తన నోటీసులో పేర్కొంది. సభకి హాజరయిన సభ్యులలో 10 శాతం కంటే ఎక్కువ మంది దానిపై చర్చకు మద్దతు పలకడంతో దానిని చర్చకు స్వీకరిస్తున్నామని స్పీకర్ కోడెల ప్రకటించారు. పది నిమిషాల టీ విరామం తరువాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యులు సమావేశమయ్యి దానిపై ఎప్పుడు సభలో చర్చించాలో నిర్ణయిస్తారని స్పీకర్ ప్రకటించారు.
నిబంధనల ప్రకారం నోటీస్ ఇచ్చినప్పటి నుండి రెండు వారాలలోగా దీనిపై సభ చర్చకు చేపట్టవలసి ఉంటుంది. కానీ ఈసారి సభలో, బడ్జెట్ పై చర్చ జరుగవలసి ఉంది. ఇంకా అనేక ఇతర సమస్యలపై కూడా సభలో చర్చ జరుగవలసి ఉంది. కనుక అవిశ్వాస తీర్మానంపై చర్చను శాసనసభ సమావేశాలు ముగిసే ముందు అనుమతించవచ్చును. కానీ దానిపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని వైకాపా ఒత్తిడి చేస్తూ ఆందోళనకి దిగే అవకాశాలున్నాయి.