టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులకు చిక్కకుండా తలదాచుకోవాలనుకున్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆచూకీని ఆ పార్టీ నేతే పోలీసులకు చేరవేశారా? ఈ కేసులో నందిగం సురేష్ అరెస్టుతో సానుభూతి పొందాలనే ఆ పార్టీ నేతలు పోలీసులను సమాచారం అందించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మొట్టమొదట మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల మాదిరి నందిగం సురేష్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. కానీ, పోలీసులు ఆయనను గురువారం ఉదయం అరెస్టు చేశారు. అయితే, నందిగం సురేష్ ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణ రెడ్డి లీక్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్.
దళిత సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేష్ ను అరెస్టు చేయడం ద్వారా ఈ కేసులో సానుభూతి పొందాలనే ..ఆయన సమాచారాన్ని సజ్జలే కింది స్థాయి నేతల ద్వారా సమాచారం చేరవేశారని ఆరోపించారు. ఈ కేసులో ఎవర్ని అరెస్టు చేసినా ఫలితం ఉండదని, సజ్జలను అరెస్టు చేయాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశ చూపి ఇలాంటి దాడులకు వైసీపీ కుట్ర చేసిందని అన్నారు.