ప్రకాశం బ్యారేజీ వద్దకు బోట్లు కొట్టుకు వస్తే ముందుగా అక్కడకు వచ్చింది దేవినేని ఉమామహేశ్వరరావు. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు వచ్చినప్పుడు దగ్గరుండి అంతా చూసుకున్నారు. సింగ్ నగర్లో ఆయన రోజూ ఏదో ఓ సందర్భంలో కనిపించేవారు. బుడమేరు కట్ట వద్ద రేయింబవళ్లూ ఉంటున్న నిమ్మల రామానాయుడు వద్దకూ వెళ్ళినా ఆయన కనిపిస్తారు. విజయవాడ వరదల్లో చంద్రబాబునాయుడు ఎంతగా కనిపించారు… దేవినేని ఉమ కూడా అంతగా కనిపించారు. కానీ ఆయనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయనకు పదవి లేదు.
ఎక్కడ చూసినా దేవినేని ఉమ
పదవి లేదని ఆయనను మీడియా, సోషల్ మీడియా పట్టించుకోలేదు కానీ.. అలా దేవినేని ఉమ ఫీలవ్వలేదు. నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా..సహాయ చర్యల విషయంలో తన అనుభవాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించారు. భారీ నీటి పారుదల శాఖా మంత్రిగా.. ఐదేళ్ల పాటు ఉన్న దేవినేని ఉమ ఆ శాఖపై పూర్తి పట్టు సాధించారు. కాల్వలు, ఏరులు, ప్రాజెక్టులపై ఆయనకు సంపూర్ణమైన అవగాహన ఉంది. కృష్ణా జిల్లా విషయంలో అయితే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆయన అందరికీ తలలో నాలుకలా మారిపోయి.. జరుగుతున్న పనుల్ని స్మూత్ గా జరిగేలా తన వంతు ప్రయత్నం చేశారు.
పదవి లేదు..పిలవలేదు అని అనుకోలేదు.. కష్టం రాగానే వచ్చేశారు !
మామూలుగా అయితే చాలా మంది టిక్కెట్ ఇవ్వలేదు.. పదవి లేదు.. పిలువలేదు.. అంటూ ఇంట్లోనే ఉండిపోతారు. కానీ దేవినేని ఉమ అలాంటి వాటికి అతీతం. చంద్రబాబు ఎలాంటి పనితీరును ఇష్టపడతారో ఆయనకు బాగా తెలుసు. అలాగే పని చేయడం దేవినేని ఉమకు కూడా చాలా ఇష్టం. అందుకే ఆయన క్షణం ఆలోచించకుండా రంగంలోకి దిగారు. ఇప్పటికీ ఫీల్డులోనే ఉన్నారు. ఉదయం ఆయన ప్రకాశం బ్యారేజీలలో జరుగుతున్న కౌంటర్ వెయిట్ పనులు.. బోట్ల తొలగింపు పనుల్ని పర్యవేక్షించారు. మధ్యాహ్నం బుడమేరు గండిని పూడ్చే పనుల వద్దకు వెళ్లారు. అక్కడే గట్టు మీద భోజనం చేశారు.
ఇతర నేతల్లా కాదు.. !
తనను ఎవరో గుర్తించాలని.. ప్రచారం చేసుకోవాలని ఆయన పెద్దగా ఫీలవ్వరు. గుర్తించేవారు ఖచ్చితంగా గుర్తిస్తారని ఆయన నమ్మకం. పార్టీ క్యాడర్ కూడా దేవినేని ఉమను గుర్తించాలని కోరుతూంటారు. అయితే తనకు పదవుల ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు రాదని.. తాను చంద్రబాబు కుటంబసభ్యుడిలాంటివాడనని..తనకు ఆ గుర్తింపు చాలని దేవినేని ఉమ అనుకుంటారు. మొత్తంగా దేవినేని ఉమ పార్టీలో అందరి దగ్గర నిస్వార్థమైన నేతగా మంచి పేరును తెచ్చుకుంటున్నారు.