2026 తమిళనాట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కథానాయకుడు విజయ్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో దిగబోతున్నాడు. ఈసారి విజయ్ సీఎం సీటుకు గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. రాజకీయాలపై ఫోకస్ చేయాలంటే సినిమాలకు దూరంగా ఉండాలి. అందుకే ‘ది గోట్’ తరవాత తాత్కాలికంగా సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాలనుకొన్నాడు విజయ్. రాజకీయాల్లోకి అడుగు పెట్టేముందు విజయ్ చేసిన సినిమా కాబట్టి, ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ బాక్సాఫీసు దగ్గర ‘ది గోట్’ ఏమాత్రం నిలబడలేకపోయింది. పేలవమైన కథ, నీరసమైన స్క్రీన్ ప్లేతో ‘గోట్’ తీవ్రంగా నిరాశ పరిచింది.
‘గోట్’ చివరి చిత్రమంటూ గట్టిగా ప్రచారం జరిగిన నేపథ్యంలో కథ విషయంలో విజయ్ చాలా కేర్‌గా ఉంటాడనుకొన్నారంతా. పైగా రాజకీయాల్లోకి దిగబోతున్నాడు కాబట్టి, తనకు పరోక్షంగా ఉపయోగపడే కథనే ఎంచుకొన్నాని భావించారు. పైగా దర్శకుడు వెంకట్ ప్రభు గత చిత్రం (కస్టడీ) ఫ్లాప్ అయ్యింది. అయినా సరే, విజయ్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడంటే మామూలు విషయం కాదు. అన్నింటికంటే ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజుకి ఓ కథ ఓకే చేశాడు విజయ్. నిజానికి ‘గోట్’ స్థానంలో ఆ కథే పట్టాలెక్కాలి. కానీ.. విజయ్ దాన్ని కూడా పక్కన పెట్టి వెంకట్ ప్రభు సినిమాని లైన్లో పెట్టాడు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొంటే, భూమి బద్దలయ్యే సబ్జెక్ట్ తో వెంకట్ ప్రభు మెస్మరైజ్ చేశాడనిపించింది. కానీ తీరా చూస్తే కథ, కథనాలే బాగా వీక్ గా కనిపించాయి. ఈ సినిమా కోసం విజయ్ రూ.200 కోట్ల పారితోషికం తీసుకొన్నాడని టాక్. పైగా ఇచ్చింది కేవలం 60 రోజులేనట. తక్కువ రోజుల్లో ఎక్కువ పారితోషికం వస్తుంది కాబట్టి, విజయ్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించి ఉంటాడని ప్రచారం జరుగుతోంది.
రాజకీయాల్లోకి వెళ్లేముందు ఓ సూపర్ హిట్ ఇస్తే… విజయ్ మైలేజీ మరోలా ఉండేది. ఈ ఫ్లాప్ విజయ్ ఉత్సాహంపై కాస్త నీళ్లు చల్లేదే.