ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను జగన్ పై పిచ్చ కోపం వచ్చింది. ఈ సారి తనపై ఫేక్ న్యూస్ తో దాడి చేయడమే దానికి కారణం. బుడమేరు అనేదానికి సంబంధం లేకుండా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిపై ఓ మినీ హైడల్ ప్రాజెక్టు ఆర్కేకు ఉంది. ఎప్పుడో ముఫ్పై ఏళ్ల కిందట దాన్ని ఏర్పాటు చేశారు. అది పడుతూ లేస్తూ నడుస్తూ ఉంటుంది. వరదలకు అది కూడా ఓ కారణమేనని సాక్షి పత్రికలో రాశారు. దాంతో ఆర్కేకు కాలిపోయింది. వినాయకచవితి కారణంగా శనివారం సెలవు కాబట్టి ఆదివారం పత్రిక రాదు అందుకే.. శుక్రవారం రాత్రికే కొత్తపలుకు రాసేశారు.
ఇందులో జగన్ పై ఆయన విరుచుకుపడ్డారు… ఓ సందర్భంలో ఏ ముహుర్తంలో పుట్టారో కానీ మనిషి లక్షణాలే లేవని కూడా మండిపడ్డారు. ఆర్కే బాధ ఆర్కేది. ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా అప్పనంగా లాభం పొందరు. ఆయన భయాలు ఆయనకు ఉంటాయి. కానీ బయట జరిగే ప్రచారం వేరు. ఆయనకు వందలు, వేల కోట్లు దోచి పెట్టేశారి సాక్షి లాంటివి ప్రచారం చేస్తూంటాయి. అనుకూల ప్రభుత్వాలు ఉన్నప్పుడు అందరితో పాటు ప్రకటనలు వస్తాయి.. జగన్ లాంటి వాళ్లు అధికారంలో ఉంటే రూపాయి కూడా ఆదాయం ఉండదు అదే తేడా. అయితే బయట జరిగే ప్రచారానికి తోడు… సాక్షి చేసే ఫేక్ తో ఈ సారి ఆయన కంట్రోల్ కోల్పోయారు.
మినీ హైడల్ ప్రాజెక్టు ద్వారా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కానీ దానికి ఎన్ని సార్లు అనుమతి రద్దయిందో చెప్పడం కష్టం. వైఎస్ ఉన్నప్పుడు దాన్ని తొలగించాలనుకున్నారు. కానీ ఆర్కే కోర్టుకెళ్లారు. తొలగించడానికి అయ్యే ఖర్చులు చెల్లించాలన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆయనకు సమస్యలు ఉంటూనే ఉంటాయి. తన హైడల్ ప్రాజెక్టుపై ఇలా ఫేక్ స్టోరీ లు రాయడంపై ఆయన ఫీలయ్యారు. దాని వల్ల నష్టం ఉందని నిరూపిస్తే తానే తొలగిస్తానని కూడా సాక్షికి చాలెంజ్ చేశారు
అంతే కాదు జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో శిక్షను తప్పించకోలేరని.. వివేకా హత్య కేసులో ఆయన భార్య కూడా ఉంది కాబట్టి.. పార్టీకి మనుగడ ఉండదని పరోక్షంగా శాపనార్ధాలు పెట్టారు. ఆర్కే ఇప్పుడు జగన్ పై ప్రతి వారం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.