రాజ్ తరుణ్ – లావణ్యల వ్యవహారం సద్దుమణిగినట్టే అనిపించినా, ఇప్పుడు మళ్లీ రాజుకొంది. పోలీసులు తమ దర్యాప్తు ముమ్మరం చేయడం, లావణ్యతో రాజ్ తరుణ్ సహ జీవనం చేశాడని నిగ్గు తేల్చడంతో రాజ్ తరుణ్ ఇరుకున పడ్డాడు. అంతేకాదు, నిన్నా మొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న లావణ్య ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకు రావడానికి ప్రయత్నిస్తోంది. రాజ్ తరుణ్ వల్ల తనకు ఒరిగిందేం లేదని, తన కుటుంబమే రాజ్ తరుణ్‌ని పోషించిందని, సినిమాల్లేక రెండేళ్లు ఖాళీగా ఉన్నప్పుడు ఆస్తులు అమ్మి రాజ్ తరుణ్‌కు రూ.70 లక్షల వరకూ ఇచ్చామని చెబుతోంది లావణ్య. అందుకు సంబంధించిన ఆధారాల్ని సైతం చూపిస్తోంది. ఇవే ఆధారాలు లావణ్య పోలీసులకు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే లావణ్య వల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రాజ్ తరుణ్ లాభపడ్డాడన్నమాట. ఒకవేళ లావణ్యతో రాజ్ తరుణ్ పూర్తిగా తెగదెంపులు చేసుకోవాల్సి వస్తే ఆ రూ.70 లక్షలకూ సమాధానం చెప్పాల్సి వస్తుంది.
ఈ వ్యవహారంలో లాభపడ్డ మరో వ్యక్తి… శేఖర్ బాషా. రాజ్ తరుణ్ గొడవలో తలదూర్చి మీడియాకు ఎక్కడు శేఖర్ బాషా. ఈ వ్యవహారం మొత్తాన్ని తాను ఓన్ చేసుకొన్నాడు. లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి, ఓ దశలో లావణ్యదే తప్పంటూ నిరూపించే ప్రయత్నం చేశాడు. నిజానికి రాజ్ తరుణ్కీ, శేఖర్కూ ఎలాంటి సంబంధం లేదు. ”ఈ విషయంలో నీ జోక్యం ఏమిటి” అంటూ లావణ్య కూడా శేఖర్‌ను గట్టిగానే నిలదీసింది. అయితే ఇప్పుడు అదే శేఖర్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.”పాపులారిటీ సంపాదించే ఉద్దేశంతోనే శేఖర్ తనకు సంబంధం లేకుండా ఈ కేసులో జోక్యం చేసుకొన్నాడు. అలా వచ్చిన పాపులారిటీతోనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. ఇదంతా శేఖర్ బాషా స్వార్థమే” అంటూ మరోసారి శేఖర్ బాషాపై ఫైర్ అయ్యింది లావణ్య. మొత్తానికి ఈ కేసులో లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరూ కొట్టుకొంటే, మధ్యలో దూరిన శేఖర్ బాషా లాభపడ్డాడనే అనిపిస్తోంది.