హైడ్రా వాళ్లు.. వీళ్లనే తేడా కనిపించనీయకుండా దూసుకెళ్తోంది. తాజాగా ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని రంగలాల్ కుంట చెరువులో బఫర్ జోన్ లో జయభేరీ అక్రమ నిర్మాణాలు కట్టిందని వాటిని తొలగించాలని ఆ నోటీసుల సారాంశం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రంగలాల్ కుంట చెరువు ఉంది. ఈ చెరువు చుట్టూ అన్నీ అతి భారీ భవనాలే ఉన్నాయి.
రంగలాల్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొంది. హైడ్రా నోటీసులపై జయభేరి సంస్థ స్పందించాల్సి ఉంది. హైదరాబాద్‌లోని పలు చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇందులో భాగంగా కొన్నిరోజుల క్రితం మాదాపూర్‌లో తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాలును హైడ్రా కూల్చివేసింది. దుర్గంచెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్లోని నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్‌లోని బడా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో జయభేరి ఒకటి. హైరైజ్ అపార్టుమెంట్ల నిర్మాణాన్ని మొదట్లోనే ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకూ ఆ సంస్థపై ఒక్క చిన్న ఆరోపణ కూడా రాలేదు. ఇప్పుడు రంగలాల్ కుంట చెరువు విషయంలో హైడ్రా నోటీసులు జారీ చేసింది. నిజానికి రంగలాల్ కుంట దగ్గర జయభేరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు లేదు. జయభేరీ కార్ వర్క్ షాప్ ఉంది. అది ఎఫ్టీఎల్లో నిర్మించి నందున తొలగించాలని ఆదేశించారని తెలుస్తోంది.