విజయానికి చాలామంది తండ్రులు. ఓటమి మాత్రం అనాథ. అది నిజం. ఓ సినిమా విజయవంతమైతే, అందులో చాలామంది చేయి ఉంటుంది. ఫ్లాప్ అయితే మాత్రం ‘ఈ ఫ్లాపు నాదే’ అని చెప్పుకోవడానికి ఎవరూ ముందుకు రారు. సినిమా అనేది సమష్టి కృషికి నిదర్శనం. అద్భుతమైన అవుట్ పుట్ రావాలంటే అందరూ శ్రమించాల్సిందే. ఒక్కోసారి చిన్న చిన్న ఐడియాలు కూడా సినిమా రూపు రేఖల్ని మార్చవొచ్చు. ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు ఇస్తారో ఎవరూ చెప్పలేరు. ఓ ఆఫీసు బాయ్ ఇచ్చిన ఐడియా… ఓ సినిమాని హిట్ చేసిందంటే నమ్ముతారా?
మలయాళంలో మమ్ముట్టి ‘హిట్లర్’ అనే ఓ సినిమా తీశారు. టీమ్ అందరికీ సినిమా నచ్చింది. కానీ ఆడుతుందా, లేదా? అనేది ఓ చిన్న అనుమానం. సినిమాపై పట్టు, అవగాహన ఉన్నవాళ్లందర్నీ పిలిచి `హిట్లర్` సినిమా చూపించి, వాళ్ల అభిప్రాయం తెలుసుకొంటున్నారు. అలా.. ఎడిటర్ మోహన్ కు పిలుపు వచ్చింది. ఆయన సినిమా చూశారు. చూడ్డమే కాదు.. ‘ఈ సినిమాని నేను తెలుగులో రీమేక్ చేస్తా… అంత బాగుంది’ అనేశారు. దాంతో మలయళ చిత్రబృందానికి సినిమాపై నమ్మకం వచ్చింది. వెంటనే రిలీజ్ చేశారు. అనుకొన్నట్టే సినిమా హిట్టయ్యింది.
ఆ తరవాత ఎడిటర్ మోహన్ తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా మోహన్ బాబుని హీరో అనుకొన్నారు. దర్శకుడిగా ఈవీవీ అయితే బాగుంటుందనిపించింది. ఆయన దగ్గరకు వెళ్తే.. అప్పటికే మోహన్ బాబుతో ‘ఈడెవడండీ బాబూ’ సినిమాకి కమిట్ అయ్యానని ఈవీవీ చెప్పారు. అలా ఈ కాంబో డ్రాప్ అయ్యింది. ‘చిరంజీవి అయితే ఎలా ఉంటుంది’ అనే ఆలోచన ఎడిటర్ మోహన్ కు వచ్చింది. ‘హిట్లర్’ ఓ అన్న కథ. ఆయన పేరుకు తగ్గట్టుగానే చాలా సీరియస్‌గా ఉంటాడు. చిరుకు ఉన్న ఇమేజ్ వేరు. చేస్తారా, లేదా? అనేది పెద్ద డౌట్. అయితే చిరు అప్పటికి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఎలాగైనా సరే, రూటు మార్చి కొత్తగా ప్రయత్నించాలన్న ఆలోచనలో ఉన్నారు. ‘హిట్లర్’ కథలో తాను కొత్తగా కనిపిస్తానన్న నమ్మకం కలిగింది. వెంటనే ఈ కథకు ఓకే చెప్పారు. దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య ఫిక్స్ అయ్యారు.
ఎడిటర్ మోహన్ ఆఫీసులో ‘హిట్లర్’కు సంబంధించిన తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఇండస్ట్రీలో పేరున్న రైటర్లంతా స్క్రిప్టులో కూర్చున్నారు. చిరంజీవి స్టైల్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులూ చేస్తున్నారు. అందరి నోటా ఒకటే మాట. ‘ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది’ అని. రోజువారి మీటింగులు, ఈ ముచ్చట్లు ఓ ఆఫీస్ బాయ్ గమనిస్తూనే ఉన్నాడు. ఓరోజు టీ సప్లై చేస్తూ చేస్తూ.. ఉండబట్టలేక ‘సార్.. ఈ సినిమా తెలుగులో ఆడదండీ’ అంటూ ఎడిటర్ మోహన్ చెవిలో చెప్పేసి వెళ్లిపోయాడు. దాంతో ఆయన షాక్ అయ్యారు. ‘ఆఫీస్ బాయ్ ఇలా చెప్పాడేంటి’ అనే టెన్షన్ మొదలయ్యింది. వెంటనే తన రైటర్లందరినీ బయటకు పంపించేశారు. ఆ ఆఫీస్ బాయ్‌ని ఒక్కడినే పిలిచారు. ‘ఈ సినిమా ఆడదా? ఎందుకో చెప్పు’ అని అడిగారు. ‘మరేంటి సార్. చెల్లెయిలు ప్రేమించినవాళ్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేయడు. అసలు వీడేం అన్నయ్య’ అన్నాడు విసుగ్గా. అప్పుడు ఆయనకు చిరంజీవి ఇమేజ్ గుర్తొచ్చింది. చిరంజీవి ఇలా చేస్తే థియేటర్లో ప్రేక్షకులు ఒప్పుకొంటారా? అనే కొత్త అనుమానం వేసింది. వెంటనే రైటర్లందరినీ పిలిపించి ‘చెల్లాయిలకు ప్రేమించినవాళ్లతో పెళ్లిళ్లు చేయకపోవడానికి నాకు బలమైన రీజన్ కావాలి’ అని ఆర్డర్ వేశారు. దాంతో రైటర్లంతా బాఆ ఆలోచించి, దానికి సరిపడా లాజిక్ సీన్లు వేశారు. ఓ చెల్లాయి ఆల్రెడీ మోసపోయిందని చెప్పి, ఆ భయంతో హిట్లర్ ఈ నిర్ణయం తీసుకొన్నాడని సీన్లు రాసి లాక్ చేశారు. ”నిజంగానే కథకు చాలా కీలకం ఆ సన్నివేశం. హీరోని నెగిటివ్ గా చూపిస్తే దానికి తగిన కారణం చెప్పాలి. లేదంటే ఆ పాత్రని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరు. ఆఫీస్ బాయ్ చెప్పినట్టుగానే కథని మార్చడం వల్ల హిట్లర్ హిట్టయ్యింది” అని చెప్పుకొచ్చారు ఎడిటర్ మోహన్.