ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా వరుసగా కొరడా ఝులిపిస్తోంది. ఓ వైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా..మరోవైపు ఉన్నపళంగా భవనాలను కూల్చివేస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడాల్సి వస్తుందని..ఈ విషయాల్లో పునరాలోచించాలని డిమాండ్ లు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉండే కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని అన్నారు. ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి, నివాసాలు ఉంటే ఆ ఇళ్లను కూల్చివేయమని స్పష్టత ఇచ్చారు.
నిర్మాణ దశలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. తాజాగా మల్లంపేట చెరువులో కూల్చివేసిన భవనాలు నిర్మాణ దశలోనే ఉన్నాయని, అందుకే వాటిని నేలమట్టం చేశామని తెలిపారు. బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు..సున్నం చెరువులో నిర్మించిన షెడ్లు కమర్షియల్ గా వాడుతున్నారు..గతంలో వాటిని కూల్చివేసినా.. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే వాటిని కూల్చివేశామని అన్నారు.
ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నివాసం ఉండే ఏ ఇంటిని కూల్చివేయమని క్లారిటీ ఇచ్చారు. రంగనాథ్ తాజా ప్రకటనతో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న యజమానులకు ఊరట లభించినట్లు అయింది.