హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల అంతు తేల్చేందుకు తీసుకొచ్చిన హైడ్రా సంచలనం రేపింది. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ ఆక్రమణలను నేలమట్టం చేస్తుందోనని అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించింది. ఫిర్యాదులు రావడమే ఆలస్యం డాక్యుమెంట్ల పరిశీలన ముగియగానే అక్రమ కట్టడమని తేలితే బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
హైడ్రా పనితీరుపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా…వెనక్కి తగ్గేదెలా అంటూ సంకేతాలు ఇచ్చింది. ప్రముఖులకు చెందిన కట్టడాలను సైతం కూల్చి హైడ్రా రాజకీయాలకు అతీతంగా పని చేస్తుందనే హెచ్చరికలను పంపింది. ఈ క్రమంలోనే హైడ్రా తీసుకున్న నిర్ణయంపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లో ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. నిర్మాణ దశలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చివేస్తామని ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. అంటే ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటికి మినహాయింపులు ఇచ్చి, కొత్త కట్టడాలను మాత్రమే టార్గెట్ చేయడం వలన ప్రయోజనం ఏంటనేది ఎవరికి అంతుబట్టడం లేదు.
వరద సమస్య నుంచి హైదరాబాద్ ను బయటపడేసేందుకు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లోని ఆక్రమణలను కూల్చివేయాలని హైడ్రాను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. కానీ, కేవలం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ దశలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చివేస్తే సర్కార్ లక్ష్యం నెరవేరుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.