“పిచ్చోడా.. నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావు” అని జగన్ రెడ్డిపై ఆప్యాయత చూపే ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచి… తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ వరకూ ఒకే స్టేట్ మెంట్ ఇచ్చారు. దాదాపుగా 99 శాతం మంది ప్రజలది అదే అభిప్రాయం. వైసీపీలోని 95 శాతం మంది నేతలు… జగన్ రెడ్డికి ఈగో తప్ప మరే రాజకీయం తెలియదని నిట్టూర్చారు. ఆ రోజు.. సెప్టెంబర్ 8. చంద్రబాబును అరెస్టు చేసిన రోజు.
చంద్రబాబు చురుకుగా రాజకీయ పర్యటనలు చేస్తూంటే… తట్టుకోలేక లండన్ పోయి.. చంద్రబాబును అరెస్టు చేయించారు. ఓ ఎఫ్ఐఆర్ లేదు.. ఓ నోటీసు లేదు.. ఒక్క సారీ విచారణ చేసింది లేదు.. కానీ అర్థరాత్రి ఆయనను అరెస్టు చేసేశారు. ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలయ్యాక కోర్టులో ప్రవేశ పెట్టారు. అన్ని వ్యవస్థల్లోనూ ముందే తమ స్క్రిప్ట్ ప్రకారం చేసే వారిని చొప్పించి పనులు పూర్తి చేశారు. కానీ ప్రజలకు అరెస్టు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పలేకపోయారు.
స్కిల్ కేసులో ఒక్క రూపాయి అవినీతి జరిగిందని చూపించలేదు.. ఎన్నో నాటకాలు వేశారు. ఢిల్లీ , హైదరాబాద్ లతో సహా ఎక్కడెక్కడో ప్రెస్మీట్లు పెట్టారు. కోర్టుల్లో వాయిదాలు కోరి బయట ప్రచారాలు చేశారు. చంద్రబాబుపై వారు చేసిన కుట్రలపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. అది వారిని రాజకీయంగా తగులబెట్టేసింది. జగన్ రెడ్డి తన ఈగోను తీర్చుకోవడానికి తన తో పాటు పార్టీ మొత్తానికి నిప్పు పెట్టుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. వైసీపీ ఉందా లేదా అన్న పరిస్థితికి వచ్చింది.
రాజకీయాల్లో చట్ట ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం ఏదైనా జరగాలి. మా చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ప్రతిపక్ష నేతల్ని తప్పుడు కేసులు పెట్టేసి అరెస్టు చేస్తామంటే కుదరదు. కనీసం తప్పు జరిగిందని నిరూపించాలి. తప్పే జరగకుండా… తామే తప్పుడు సాక్ష్యాలు చేయించేసి.. అరెస్టు చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు జగన్ రెడ్డి చూస్తున్నారు. ఆ కేసుల పర్యవసాల్లో ఓటమి అది ఓ పది శాతమే.. ఇంకా 90 శాతం ఆయన అనుభవించాల్సి ఉంది.