బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై ఆగస్టులోనే విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డితోపాటు వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉంటుందని సుప్రీకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. మరో వైపు.. స్పీకర్ కు నిర్దిష్ట గడువును న్యాయస్థానాలు విధించలేవని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదించారు.
ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు.. రిజర్వ్ చేసిన తీర్పును సోమవారం వెలువరించనున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని ముగ్గురు ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.