ఈ యేడాది తెలుగు చిత్రసీమది ఎగుడు దిగుడుల ప్రయాణమే. ఓ హిట్ వస్తే… వరుసగా ఓ డజను ఫ్లాపులు ముసురుకుంటున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బోల్తా పడుతున్నాయి. వేసవి సీజన్‌ని చిత్రసీమ క్యాష్ చేసుకోలేకపోయింది. ఎన్నికలు, ఐపీఎల్, వర్షాలు.. ఇవన్నీ టాలీవుడ్ పై గట్టి ప్రభావమే చూపించాయి. 2024 క్యాలెండర్ ముగిసిపోవడానికి మరో మూడు నెలల సమయమే ఉంది. ఈ మూడు నెలల్లో మూడు క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. 2024 చేదు జ్ఞాపకంలా మిగిలిపోవాలన్నా, సంతృప్తికరమైన విజయాలతో ఈ యేడాదిని ముగించాలన్నా ఈ మూడు సినిమాల ఫలితాల పైనే ఆధారపడి వుంది.
ఈ నెలాఖరున ‘దేవర’ రాబోతోంది. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకొన్న చిత్రమిది. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కొరటాల చిరంజీవితో చేసిన ‘ఆచార్య’ డిజాస్టర్ అయినా, ఆ ప్రభావం ఈ సినిమా మేకింగ్ పై పడకపోవడం ఓ సానుకూల సంకేతమే అని చెప్పుకోవాలి. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఈ సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. ఓవర్సీస్లో ప్రీ బుకింగుల హవా చూస్తుంటే, ‘దేవర’ ఏదో సంచలనం సృష్టించబోతోందన్న నమ్మకం కలుగుతోంది. ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ పై మిశ్రమ స్పందన ఉన్న మాట నిజమే, అయితే ట్రైలర్‌తో అందరి అంచనాల్ని పటాపంచలు చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ప్రమోషన్లు కూడా మొదలుపెట్టేస్తున్నారు. రెండువారాల పాటు విస్కృతంగా ప్రమోట్ చేసి ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని కొరటాల అండ్ టీమ్ భావిస్తోంది.
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఈ డిసెంబరులోనే రాబోతోంది. శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. కంటెంట్ పరంగా కాస్త వీక్‌గా కనిపిస్తోంది. ఎలాంటి అప్ డేట్లూ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే.. అవుట్ పుట్ పై మాత్రం దిల్ రాజు సంతృప్తిగానే ఉన్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అంటున్నారు. రామ్ చరణ్ సినిమా హిట్టయితే అంకెలు రూ.200 కోట్ల నుంచి మొదలు పెట్టాలి. అదే జరిగితే… ఈ యేడాది చివర్లో అయినా బాక్సాఫీసుకు కాస్త ఊపు వస్తుంది.
ఇక అందరి కళ్లనీ తన వైపు తిప్పుకొన్న సినిమా `పుష్ష 2`. పుష్ష సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బాక్సాఫీసు దగ్గర విజయ ఢంకా మోగించిన ఈ చిత్రం బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం సైతం తెచ్చి పెట్టింది. పార్ట్ 2 పై పెరిగిన భారీ అంచనాల్ని దృష్టిలో ఉంచుకొన్న సుకుమార్ తన వైపు నుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకొని ఈ సినిమాని ఓ శిల్పంలా చెక్కుతున్నాడు. సినిమా ఆలస్యమైనా, ష్యూర్ షాట్ హిట్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
దేవర, పుష్ష 2, గేమ్ ఛేంజర్… ఈ మూడు చిత్రాలూ హిట్ అవ్వడం ఆయా హీరోలకే కాదు… తెలుగు చిత్రసీమకు కూడా చాలా అవసరం. వచ్చే యేడాది బండిని ఫుల్ జోష్‌లో మొదలు పెట్టడానికి ఈ విజయాలు టానిక్ లా ఉపయోగపడతాయి. జనాలు లేక బోసిబోయిన థియేటర్లకు, వరుస ఫ్లాపులతో తల్లడిల్లుతున్న బయ్యర్లకూ కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం ఈ ముగ్గురు హీరోల బాధ్యత.