శేఖర్ కమ్ముల… క్లాస్ టచ్ ఉన్న ఓ మంచి దర్శకుడు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా… ఈ సినిమా పేర్లు చెబితే చాలు. శేఖర్ కమ్ముల బ్రాండ్ ఏమిటో అర్థమైపోతుంది. గోదావరి గట్టున కూర్చుని, ఆ చల్లగాలి పీలుస్తూ వేడి వేడి కాఫీ తాగిన ఫీలింగ్ శేఖర్ కమ్ముల సినిమాలు చూస్తే కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ పల్స్ బాగా పట్టేశారాయన. శేఖర్ కమ్ముల నుంచి ఓ సినిమా వస్తోందంటే అది కచ్చితంగా క్లాస్ సినిమానే అనుకొంటున్న తరుణంలో ‘కుబేర’తో షాక్ ఇస్తున్నాడు ఈ దర్శకుడు. ధనుష్, నాగార్జునలతో శేఖర్ కమ్ముల చేస్తున్న మల్టీస్టారర్… ‘కుబేర’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఇందులో మాస్, యాక్షన్ అంశాల్ని మేళవించాడట శేఖర్ కమ్ముల. యాక్షన్ ఫీట్లకు, కమర్షియల్ ఎలిమెంట్లకు శేఖర్ కమ్ముల చాలా దూరం. అసలు స్టార్ హీరోల గురించే పట్టించుకోడు. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోల్ని ఏరి కోరి ఎంచుకొన్నాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా రషెష్ చూసినవాళ్లంతా శేఖర్ కమ్ముల చాలా మారిపోయాడని, తనని తాను చాలా అప్ డేట్ చేసుకొన్నాడని, కమర్షియల్ వాల్యూస్ తనదైన శైలిలో డీ కోడ్ చేశాడని అంటున్నారు.
శేఖర్ కమ్ముల సంగీతం కూడా క్లాస్ టచ్‌తోనే ఉంటుంది. ఆయన మెలోడీలకే పెద్ద పీట వేస్తారు. అయితే ఈ సినిమా కోసం ఆయన తొలిసారి దేవిశ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నారు. దేవీ మెలోడీలనూ ఇవ్వగలడు, ఫాస్ట్ బీట్ పాటలూ చేయగలడు. ఈ సినిమాలో రెండింటికీ ఛాన్స్ ఉందట. శేఖర్ కమ్ముల నుంచి వచ్చే పాటలంటే శ్రోతలకు ఓరకమైన అభిప్రాయం ఉంది. అయితే ఈసారి ఆ అభిప్రాయాల్ని, అంచనాల్ని కూడా శేఖర్ కమ్ముల బ్రేక్ చేయబోతున్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఓ మంచి దర్శకుడికు కమర్షియల్ పాయింట్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ‘కుబేర’ ఓ పెద్ద ఉదాహరణగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి.. కుబేరతో శేఖర్ కమ్ముల టాలీవుడ్ పై ఎలాంటి మార్క్ వేయబోతున్నాడో, తన ఫ్యాన్స్ ని ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నాడో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.