పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో హైకోర్టు తాజా ఆదేశాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయంటూ ఆ పార్టీ సంబరపడుతోన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ గా పదవిని కట్టబెడుతూ బీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చారు.
పీఏసీ చైర్మన్ పదవి అనేది ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండటంతో ఆ పార్టీలో కీలకమైన నేతగా ఉన్న హరీష్ రావుకు పీఏసీ చైర్మన్ పదవిని ఇవ్వాలని బీఆర్ఎస్ భావించింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై పీఏసీ భేటీలోనే నిర్ణయాలు జరుగుతుంటాయి. దాంతో ఈ కీలకమైన పదవిని హరీష్ రావుకు ఇవ్వాలని బీఆర్ఎస్ భావించినా.. రేవంత్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పోస్ట్ ను కట్టబెట్టారు. ఆయన కాంగ్రెస్ లో చేరినప్పటికీ అరికపూడి గాంధీ టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు..పీఏసీ పదవిపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇవడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. బాధ్యత కల్గిన ప్రతిపక్ష నాయకులకు ఈ పదవిని ఇస్తారని రేవంత్ మాత్రం అందుకు విరుద్దంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.