పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తీసుకోకపోతే సుమోటోగా మళ్లీ విచారిస్తామని కోర్టు తెలిపింది. ఈ విషయంలో అసలు మెరిట్ ఏమిటన్న విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ మాత్రం.. ఇక ఉపఎన్నికలు వస్తున్నాయి కాస్కోండి అని ప్రకటించేసింది. పది స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని క్యాడర్ రెడీ కావాలని సూచించింది.
బీఆర్ఎస్ హడావుడి చూసి.. అంత అవకాశం ఉందేమో అనుకుంటున్నారు కానీ.. కాంగ్రెస్ అనుకుంటే తప్ప రావని బీఆర్ఎస్కు కూడా తెలుసు. ఒక వేళ ఉపఎన్నికలు వస్తే.. అది తమకు ఎంత పెద్ద కష్టం తీసుకు వచ్చి పెడుతుందో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బాగా తెలుసు. ఇప్పడు పది స్థానాల్లో ఎన్నికలు వస్తే.. ఒక్క చోట కూడా గెలవడం సంగతేమో కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో పోయినట్లు డిపాజిట్లు పోయినా ఆశ్చర్యం లేదు.
బీఆర్ఎస్ కు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ను క్రమంగా బీజేపీ కైవసం చేసుకుంటోంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఏది అంటే.. ఎక్కువ మంది బీజేపీ వైపే చూస్తున్నారు కానీ..బీఆర్ఎస్ కు మరో చాన్సిద్దామని అనుకోవడం లేదు. ఆ విషయం పార్లమెంట్ ఎన్నికల్లోనే తేలిపోయింది. అందుకే .. బీఆర్ఎస్ బయటకు ఉపఎన్నికలు అని చెప్పి.. పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఇతర ఎమ్మెల్యేల్ని బెదిరిస్తుంది కానీ.. నిజంగా అలాంటిదేమైనా వస్తే తమకే నష్టమని అంచనా వేయకుండా ఉంటుందని అనుకోలేమని ఎక్కువ మంది భావన.