శిద్దా రాఘవరావు కుటుంబం మళ్లీ టీడీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు పట్టించుకోకపోతూండటంతో శిద్దా రాఘవరావు రెండు రోజుల కిందట సీఎంఆర్ఎఫ్ విరాళం పేరుతో చంద్రబాబును కలిసి ఫోటో దిగారు. ఆయన వెంట దామచర్ల జనార్దన్ కూడా ఉన్నారు. సీఎంఆర్ఎఫ్కు శిద్దా రాఘవరావు యాభై లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.
శిద్దాను చంద్రబాబు చాలా ప్రోత్సహించారు. 2014-19 మధ్య ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ ఆయనపై తీవ్ర వేధింపులకు పాల్పడింది. ఆయన గ్రానైట్ వ్యాపారాలకు వందల కోట్లు ఫైన్లు వేసింది. చివరికి ఆయన పార్టీ మారిపోయారు. దాంతో ఆ ఫైన్లు రద్దు చేశారు. అయితే ఎన్నికల్లో ఆయనకు ఎక్కడా టిక్కెట్ కేటాయించలేదు. దర్శి టిక్కెట్ ను రెడ్డి వర్గ నేతకే ఇచ్చారు కానీ. శిద్దాకు ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది.
శిద్దా రాఘవరావు టీడీపీలో చేరికపై కొంత మంది ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు అభ్యంతరాలు ఉన్నాయి. ఐదేళ్లు మంత్రిగా ఉండి.. వేధింపుల పేరుతో పార్టీ మారిన వాళ్లను ఎంటర్ టెయిన్ చేయాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వచ్చిందనే ఆయన వస్తున్నారన్న సంగతిని గుర్తుంచుకోవాలని అంటున్నారు. కొద్ది రోజుల కిందటే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి సైలెంట్ గా ఉంటున్నారు.