ఈరోజే ‘దేవర’ ట్రైలర్ వస్తోంది. సాయింత్రం అందరి కళ్లూ ఈ ట్రైలర్ పైనే. దాదాపు 3 నిమిషాల నిడివి గల ట్రైలర్ కట్ చేశారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్‌కి పెద్ద పీట వేశారని, ఎన్టీఆర్ రెండు లుక్సూ ఈ ట్రైలర్ లో రివీల్ చేయబోతున్నారని తెలుస్తోంది.
‘దేవర’ కథేంటన్నది ఇంత వరకూ బయటకు రాలేదు. జనాలు రకరకాలుగా ఊహించుకొంటున్నారు. కానీ ఎవరికీ ఎలాంటి స్పష్టత లేదు. ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్‌ని స్ఫూర్తిగా తీసుకొని, ఈ కథ రాసుకొన్నాడని ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. టీజర్లో గానీ, ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రమోషన్ కంటెంట్ లోగానీ, ఈ సినిమా కథేమిటన్నది కొరటాల చెప్పనే లేదు. కానీ ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి. కొరటాల శివ సినిమాల్లో ఓ బలమైన సోషల్ మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఈ కథలో ఉందా, ఉంటే అది ఎలాంటి సందేశం? అనేది కూడా ట్రైలర్ చూశాకే తెలుస్తుంది. కొరటాల శివ ఎప్పుడూ కథని ఇంతగా దాచి పెట్టింది లేదు. సినిమా మొదలైనప్పుడే ఏ జోనర్లో ఉంటుందో చెప్పేస్తాడు. టైటిల్ లోనే తన పంథా అర్థమైపోతుంది. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ ఈ టైటిల్స్ చూసి చెప్పేయొచ్చు. ఎలాంటి కథాంశం ఎంచుకొన్నాడో? కానీ ‘దేవర’ టైటిల్ లో అలాంటి క్లూ లేదు. అందుకే ట్రైలర్ కోసం ఇంతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ‘ఆచార్య’ తరవాత మళ్లీ ఫామ్ ని అందుకోవడానికి కొరటాల ముందున్న అద్భుతమైన అవకాశం ఇది. దాన్ని అందిపుచ్చుకోవడానికి కొరటాల అహర్నిశలూ కష్టపడ్డాడని, ఓ బలమైన కథ రాసుకొన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అది నిజమా, కాదా అనేది ఈ రోజు తేలిపోతుంది.