వైసీపీ దారుణంగా ఓటమి పాలవ్వడానికి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు కూడా ఓ కారణమేనన్నది ఓపెన్ సీక్రెట్. బూతులు మాట్లాడే నేతలను ప్రోత్సహించడం..వారికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ప్రజల్లో వైసీపీ అంటేనే హేయభావం కలిగేందుకు కారణమైంది. మంత్రులు , ఎమ్మెల్యేలు ఎవరికి వారు తగ్గేదేలే అంటూ ప్రత్యర్ధి పార్టీల నాయకులపై బూతులతో రెచ్చిపోయేవారు. అలా మాట్లాడే నేతల వలన వైసీపీకి భారీగా డ్యామేజ్ జరిగిందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీకి తత్త్వం బోధ పడిందో మరేమిటో కానీ , బూతులు మాట్లాడే నేతలను పక్కనపెట్టింది. పార్టీ తరఫున మీడియాతో మాట్లాడే నేతల జాబితాను విడుదల చేసిన వైసీపీ.. అందులో బూతులకు ప్రాధాన్యత ఇచ్చే కొడాలి నాని, పేర్ని నాని , జోగి రమేష్, ఆర్కే రోజా , అంబటి రాంబాబు వంటి సీనియర్ నేతలకు చోటు కల్పించలేదు.
మీడియా ముందు మాట్లాడాల్సిన అధికార ప్రతినిధుల జాబితాలో 14 మందికి చాన్సు ఇచ్చింది వైసీపీ. పోతిన మహేష్, నాగార్జున యాదవ్, శివశంకర్ రెడ్డి,కారుమూరి వెంకటరెడ్డి, సుందర రామశర్మ, చల్లా మధుసూదన్ రెడ్డి , కొండా రాజీవ్ తోపాటు మరికొంతమంది కొత్త మొహాలకు చోటు కల్పించింది.
మీడియా ఛానెల్స్ అన్ని డిబేట్లకు వీరిని మాత్రమే చర్చలకు పిలవాల్సి ఉంటుంది. వీరు కాకుండా మరెవరూ టీవీ డిబేట్లలో పాల్గొన్నా వాటితో వైసీపీకి ఎలాంటి సంబంధం ఉండదు. మొత్తానికి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా వైసీపీ వైఖరి ఉందని.. బూతులు మాట్లాడే నేతల నోరును అప్పట్లోనే కట్టడి చేసుంటే వైసీపీకి దారుణమైన ఫలితాలు వచ్చి ఉండేవి కావని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.