విపత్తుల్లో వరద బాధితుల్ని ఆదుకోవడం అంటే.. తేలికగా డబ్బులు ప్రింట్ చేసి తీసుకొచ్చి ఇంటికి ఓ లక్ష పంచేయడమే అన్నంత తేలికగా మాట్లాడుతున్నారు పీసీసీ చీఫ్ షర్మిల. విజయవాడలో వరద బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని ఎంత పరిహారం ఇప్పించమంటారు అని అడిగారు. ఆ బాధితుడు రూ. లక్ష ఇప్పించండమ్మా అన్నారు. ఆయన చెప్పిన సంఖ్య రౌండ్ ఫిగర్ గా సరిపోతుందని అనుకున్నారేమో షర్మిల ఏ మాత్రం మొహమాటపడకుండా కేంద్రం నుంచి ఓ పదివేల కోట్లు తెచ్చేసి ఇంటింటికి లక్ష చొప్పున పంచేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ ఎంపీలను కేంద్రం వాడుకుంటోందని అందుకే పదివేల కోట్లు డిమాండ్ చేసి తీసుకు రావాలనేది షర్మిల లాజిక్. షర్మిల చేస్తున్న ఇలాంటి ప్రకటనల వల్ల ఆమెలో పొలిటికల్ సీరియస్ నెస్ లేదన్న అభిప్రాయమే ఏర్పడుతుంది .. ఆమె కనీసం ఓ మాదిరిగా కూడా ఆలోచించరన్న అభిప్రాయానికి వినేవారు వస్తారు. అయినా షర్మిల మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ఈ ప్రకటన చేస్తున్నారు.
ఇప్పటికే ప్రభత్వం ఇంటింటికి తిరిగి ఎంత నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ చేస్తున్నారు. వందకు వంద శాతం నష్టం భర్తీ చేయకపోయినా వీలైనంత వరకూ సాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బైకులు రిపేర్లు చేయించడం వంటివి చేస్తోంది. ఇళ్లు శభ్రం చేయించడం దగ్గర్నుంచి ఇన్సూరెన్స్ లు క్లెయిమ్ చేయించడం వరకూ ప్రతి విషయంలోనూ కింది స్థాయి నుంచి ఆలోచన చేస్తోంది. ఇలా చేయడమే అలుసన్నట్లుగా.. ఏకంగా ఇంటికి లక్ష పంచమని డిమాండ్ చేస్తున్నారు.