విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిందా…? స్వయంగా కేంద్రమంత్రి వచ్చి చెప్పిన తర్వాత కూడా ఎందుకు కదలిక లేదు…? ఎందుకు క్రమంగా ఉత్పత్తి తగ్గిస్తున్నారు…? ఇలాంటి ప్రశ్నలకు బుధవారం ఓ సమాధానం దొరికే అవకాశం ఉంది.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని… విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ బీజేపీ సహా కూటమి పార్టీలు ప్రకటించాయి. మేనిఫెస్టోలో కూడా చేర్చాయి. అధికారంలోకి వచ్చాక స్వయంగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి వచ్చి సానుకూల ప్రకటన చేసి వెళ్లారు. కానీ ఏటూ తేల్చలేదు.
మరోవైపు కొత్తగా వచ్చిన సీఎండీ ఫ్యాక్టరీని పట్టాలెక్కిస్తారనుకుంటే… చేతులెత్తేశారు. దీంతో ఆయన్ను దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయి. కార్మికులు ఇప్పటికీ 2007లో సవరించిన వేతనాల ప్రకారమే పనిచేస్తున్నారు. అయితే, నష్టాలను మరింత ఎక్కువ చేసేలా ఉత్పత్తిని గణనీయంగా తగ్గించారని కార్మిక సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి.
ఈ తరుణంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి వైజాగ్ ఉక్కు పరిశ్రమపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ తీసుకునే నిర్ణయాన్ని కేంద్ర సబ్ కమిటీ ముందు ఉంచబోతున్నారు. అంటే ఈ రోజు తీసుకునే నిర్ణయమే ఫ్యాక్టరీ భవిష్యత్ అన్నమాట.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను రక్షించాలంటే సెయిల్ లో విలీనం చేస్తే సరిపోతుందని… అలా చేయటం వల్ల సెయిల్ ను విస్తరించాలనుకునే నిర్ణయం అమలు కావటంతో పాటు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి.