‘హనుమాన్’ విజయంతో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్నాడు ప్రశాంత్వర్మ. ఈ సినిమా విజయం ‘ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్’కి బలమైన పునాదులు వేసింది. ప్రస్తుతం ఒకేసారి చాలా సినిమాలపై వర్క్ చేస్తున్నారు వర్మ. నిజానికి హనుమాన్ తర్వాత జై హనుమాన్ రావాలి. తొలి భాగంలోనే సెకండ్ పార్ట్ రిలీజ్ 2025 అని ఇచ్చారు.
అయితే పార్ట్ 2 ఆ సమయానికి రావడం లేదు. జై హనుమాన్ కంటే ముందు ప్రశాంత్ వర్మ నుంచి మరో సినిమాలు వచ్చే అవకాశం వుంది. అందులో అధీరా వుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయననే చెప్పారు. ‘జై హనుమాన్’ కోసం ఎంతోమంది కష్టపడుతున్నారు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఇంకా గ్రాండ్ గా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీరా వస్తుంది. దీనితో పాటు మరో రెండు సినిమాలకు కూడా పనిచేస్తున్నాం’ అని చెప్పారు ప్రశాంత్వర్మ. అధీరాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారా, లేదంటే ఆ బాధ్యత మరొకరికి అప్పగిస్తారా? అనేది ఆసక్తికలిగిస్తోంది. మోక్షు సినిమా ఉంది కాబట్టి, అధీరా ప్రాజెక్ట్ చేతులు మారే అవకాశాలే ఎక్కువ. దాంతో పాటు ప్రశాంత్ వర్మకి బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. హృతిక్ రోషన్ తో తాను ఓ సినిమా చేసే అవకాశం ఉంది. మోక్షజ్ఞ సినిమా తరవాత దాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా `జై హనుమాన్` స్క్రిప్టు పనులు కూడా ఓ కొలిక్కి రావాల్సివుంది. స్క్రిప్టు లాక్ అయితే ఆ సినిమా స్కేల్ అర్థం అవుతుంది.
మరోవైపు నందమూరి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇతిహాసాలతో ముడిపడిన కథని రాసుకున్నారు వర్మ. ఈ సినిమా కూడా ‘ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగానే ఉంటుంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ముహూర్తం జరుపుకోనుంది.