బ్రహ్మానందం అంటే కామెడీ. కామెడీ అంటే బ్రహ్మానందం. ఈ విషయంలో మరో మాటకు తిరుగులేదు. ఇప్పుడంటే ఆయన జోరు తగ్గింది కానీ, ఒకప్పుడు ఏ సినిమాలో చూసినా బ్రహ్మీనే. ఇప్పటికీ ఆయన జోకులు, హావ భావాలూ, సింగిల్ లైనర్లు మనకు బోలెడంత కాలక్షేపం ఇస్తుంటాయి. వందల కొద్దీ మీమ్స్ పేజీలు ఆయన పేరు చెప్పుకొని బతికేస్తుంటాయి. అందుకే ఆయన్ని మీమ్స్ మహరాజ్ అంటుంటారు ముద్దుగా.
అయితే బ్రహ్మానందంలో అంతర్లీనంగా ఓ గొప్ప నటుడు ఉన్నాడు. మన దర్శకులు కామెడీ పాత్రలకు పరిమితం చేశారు కానీ, బహ్మీ ఓ ఆల్ రౌండర్. బాబయ్ హోటల్, అమ్మ లాంటి చిత్రాల్లో బ్రహ్మానందం నటన మరో కోణంలో బయట పడింది. అయితే బ్రహ్మానందాన్ని ఎక్కువగా కామెడీ రోల్స్ లోనే చూడ్డానికి ఇష్టపడడంతో ఆయన కూడా వాటికే పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు బ్రహ్మీ వయసు పెరిగింది. పరుగు నెమ్మదించింది. హడావుడిగా సినిమాలు చేసేయడం ఆయనకు కూడా నచ్చడం లేదు. మనసుకు నచ్చిన పాత్రలు వస్తేనే ఒప్పుకొంటున్నారు. కామెడీ పాత్రల్ని దాటి తనని తాను మళ్లీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు మంచి మార్కులు పడ్డాయి. తనలోని వైవిధ్యం ఈ సినిమాతో మరోసారి ఆవిష్కృతమైంది. నటుడిగా ఆయనకూ సంతృప్తి లభించింది. ఇప్పుడు వస్తున్న `ఉత్సవం` చిత్రంలోనూ అలాంటి కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చారనిపిస్తోంది. ఇందులో బ్రహ్మీ నాటకాల రాయుడిగా కనిపించనున్నారు. ట్రైలర్ లో బ్రహ్మానందం విశ్వరూపమే కనిపించింది. పౌరాణిక పాత్రలో, ఎస్వీఆర్ పూనినట్టు ఆయన డైలాగులు చెబుతుంటే.. చూడ ముచ్చటేస్తోంది. ఎస్వీఆర్ని దాదాపుగా ఇమిటేట్ చేశారు బ్రహ్మానందం. ఎస్వీఆర్ లాంటి నటుడ్ని గుర్తు చేయడం మామూలు విషయం కాదు. నిమిషం నిడివిగల సంభాషణను గుక్క తిప్పుకోకుండా చెప్పిన విధానం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఓరకంగా బ్రహ్మానందం కొత్త ఇన్నింగ్స్ లో రాబోతున్న మరో మంచి పాత్ర ఇదనిపిస్తోంది. చిన్న సినిమా అయినా మంచి కాస్టింగ్ ఉండడం వల్ల `ఉత్సవం`పై ఫోకస్ పడింది. ఈవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఇందులో బ్రహ్మానందం పాత్రకు ఎన్ని మార్కులు పడతాయో చూడాలి.