మెడికల్ కాలేజీ అన్నా, ఎంబీబీఎస్ విద్య అన్నా అమ్మో అనే పరిస్థితి. డాక్టర్ చదువు అంటే… అతి కొద్ది సీట్లలో మనకు వస్తదా అన్న డౌట్… కోట్లాది రూపాయలు చెల్లించి మెడికల్ విద్యను చదవలేక, ప్రభుత్వం నుండి అవకాశం లేక ఎంతో ఉన్నతమైన డాక్టర్ వృత్తికి దూరమైన వారు ఎందరో. సరిపడ వైద్యులు లేక… సరైన సమయంలో వైద్యం అందక పోయిన ప్రాణాలు తెలంగాణలో ఇంకెన్నో.
కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఎంతగా అంటే 33జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావటం. విభజన నాటికి ఉమ్మడి పది జిల్లాల్లో కేవలం రెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఏకంగా 33కి పెరిగాయి. ప్రైవేటు కాలేజీలు వీటికి అదనం.
ఒక్క మెడికల్ కాలేజీ వస్తే ఏమౌతుంది… కేవలం 50సీట్లు ఏడాదికి ఉంటాయని అనుకునే వారు కూడా ఉన్నారు. కానీ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ వస్తే… స్థానికంగా వైద్యం కూడా అందుబాటులో ఉంటుంది. అంతకు మించి విద్యను కొనలేని వారు కూడా వైద్యవిద్యను అభ్యసించే అవకాశం వచ్చింది. గతంలో కేవలం 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్యకు 4,090కు పెరిగింది. ఇది నిజంగా ఉన్నత ఆలోచనకు ప్రతిరూపమే.
కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు పోయే ముందు ఇచ్చిన మెడికల్ కాలేజీల్లో యాదాద్రి, మహేశ్వరం, మెదక్ కాలేజీలకు తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వసతులు సరిగ్గా లేవని మొదట్లో కొర్రీలు పెట్టినా… ప్రభుత్వం తరఫున అధికారులు కేంద్రంతో జరిగిన సంప్రదింపులు విజయవంతం అయ్యాయి.
తాజా సీట్లతో… దేశంలోనే జనాభాకు తగ్గట్లుగా అంటే ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.