హైడ్రా దూకుడుపై ఎన్ని విమర్శలు వస్తున్నా… కూల్చివేతలు మాత్రం ఆగటం లేదు. పక్కా సమాచారంతో, పోలీస్ ప్రొటెక్షన్ తో కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి. సీఎం కూడా హైడ్రా ఆగదు, చెరువులను కబ్జా కోరల నుండి కాపాడుతుంది అని హెచ్చరిస్తూనే ఉన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఇప్పటి వరకు ఏకంగా 262 భవనాలను నేలమట్టం చేసింది. మొత్తం 117.72ఎకరాలను కబ్జాల నుండి కాపాడినట్లు తెలిపింది. మొత్తం 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు ప్రకటన విడుదల చేసింది.
ఇక ఇందులో అత్యధికంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్, పరిసర ప్రాంతాల్లోనే జరిగాయి. జూన్ 27నుండి ఈ కూల్చివేతలు ప్రారంభం కాగా… అత్యధికంగా గాజుల రామారం చింతలబస్తీ చెరువు బఫర్ జోన్ లో 54 నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. ఆ తర్వాత రాజేంద్రనగర్, మాదాపూర్ లలోని చెరువుల్లోని బఫర్ జోన్ లలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు.
ఇక హైడ్రాకు మరిన్ని పవర్ ఇచ్చేలా సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులను హైడ్రాకు కేటాయించింది పోలీస్ శాఖ. వీటికి తోడు భవిష్యత్ లో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే వ్యవస్థల్లో హైడ్రాను కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.