పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని లీకులు ఇచ్చిన జాతీయ నాయకత్వం ఇంకా నాన్చుతోంది. ప్రస్తుతం అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతుండటంతో ఎక్కువగా పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో పార్టీ గ్రాఫ్ పడిపోతుందని బీజేపీలోనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ క్రమంలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. సభ్యత్వ నమోదు , మండల, జిల్లా కమిటీల ఏర్పాటు తర్వాతే నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అంతా పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని చెప్పారు.
ఇటీవల తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిని నియమించడంతో ఇప్పుడు బీజేపీ కూడా కొత్త అధ్యక్షుడిని నియమించాలని భావిస్తోంది. ఈమేరకు త్వరలోనే ప్రకటన ఉంటుందని ఈటల వ్యాఖ్యానించడంతో.. ఈ విషయమై జాతీయ నాయకత్వం ఆయనకు ఏమైనా సంకేతాలు ఇచ్చిందా? అని తాజాగా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ నేతకు పగ్గాలు అప్పగించడంతో.. బీజేపీ కూడా బీసీ నేతకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఈటలకు బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.