ఏపీలో మద్యం అనగానే… అమ్మో అన్నట్లు తయారైంది పరిస్థితి. జగన్ సీఎం అయ్యాక మద్యపాన నిషేధం అని చెప్పిన మాటలు అమలుకాకపోగా, చీప్ లిక్కర్ కు తోడు ఎక్కడ లేని కొత్త బ్రాండ్స్ ను ప్రజలపై రుద్దారు. జగన్ కు తీవ్ర వ్యతిరేకత తెచ్చిన అంశాల్లో ఇది కూడా ఒకటి.
కొత్త ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ తీసుకరాబోతుంది. ఇప్పటికే ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ మద్యం పాలసీపై పని ప్రారంభించింది. బెస్ట్ మద్యం పాలసీలున్న ఆరు రాష్ట్రాల్లో వారు తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరును బట్టి ఏపీలోనూ కొత్త మద్యం పాలసీని తీసుకరాబోతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే ధరలతో పాటు అన్ని రకాల బ్రాండెడ్ మద్యం ఏపీలోనూ అందుబాటులోకి తీసుకరాబోతున్నారు.
ఇప్పటి వరకు ఏపీ సర్కార్ స్వయంగా మద్యం షాపులను నిర్వహించింది. అయితే, కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వమే వైన్స్ షాప్స్ నిర్వహిస్తుందా… లేక, తెలంగాణ తరహాలో డ్రా ద్వారా బయట వ్యక్తులకు అవకాశం కల్పించి, మద్యం విక్రయాలు చేసేలా అనుమతి ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ఎలా తీసుకొచ్చినా… పారదర్శకంగా, ప్రజలకు మేలు జరిగేలా ఉండటంతో పాటు రాష్ట్రంలో గంజాయి వినియోగం అరికట్టేలా ఉండాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.