చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో జోగి రమేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయగానే ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేట మొదలు పెట్టారు. తన అరెస్ట్ ఖాయమని అంచనా వేసిన జోగి రమేష్ అప్పటికే పోలీసుల కళ్లుగప్పి అజ్ఞాతంలోకి వెళ్లారు. జోగి రమేష్ ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం జోగి రమేష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరి అక్కడైనా జోగి రమేష్ కు ఊరట లభిస్తుందో లేదో చూడాలి.
ఇక , టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.