కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడి దేశం మొత్తాన్ని కదిలించింది. ఒక్క బెంగాల్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా డాక్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రాణాలు పోసే డాక్టర్లు ఒక రోజు సమ్మె చేశారు. కేంద్రం హామీ ఇవ్వటంతో విరమించారు.
ఆ ఘటన మరవక ముందే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి జరిగింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్న మహిళా జూనియర్ డాక్టర్ పై పేషెంట్ బంధువులు దాడి చేశారు. ఆఫ్రాన్ లాగి, దాడి చేసేందుకు ప్రయత్నించటంతో అక్కడే ఉన్న ఇతర సిబ్బంది అడ్డుకున్నారు. దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
డాక్టర్ పై దాడి చేయటంతో ఆసుపత్రి వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితుడిని అరెస్ట్ చేసి, చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ దాడి ఘటనను జూనియర్ డాక్టర్లు సీరియస్ గా తీసుకున్నారు. తమకు రక్షణ లేదని, అధిక సమయం అయినా ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంటే తమ ప్రాణాలే కోల్పోయేలా ఉన్నాం అంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం ఉదయం నుండి ఆందోళనను ఉధృతం చేసే అవకాశాలున్నాయి.