తెలంగాణలో త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించనుండటంతో ఏపీలోనూ నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ అధ్యక్షురాలుగా కొనసాగుతోన్న పురంధేశ్వరి 2022లో బాధ్యతలు స్వీకరించారు. కమలం పార్టీలో అధ్యక్ష పదవి కాలం రెండేళ్ళు మాత్రమే కావడంతో.. త్వరలోనే ఆమె పదవికాలం ముగియనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి అధ్యక్షులను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఏపీలో పురంధేశ్వరి తర్వాత ఎవర్ని అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ పదవి వరించే అవకాశాలు అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన వారంతా కోస్తా జిల్లాలకు చెందిన వారే కావడంతో.. ఈసారి రాయలసీమకు చెందిన నేతకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు.
వైసీపీకి బాగా పట్టున్న సీమ జిల్లాలో ఆ పార్టీ బలహీనపడటంతో.వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ప్రయోజనం చేకూరుతుందనే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉండొచ్చు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా.. వైసీపీకి దన్నుగా ఉండే రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీని విశ్వసించడం లేదు. ఈ క్రమంలోనే వారిని తమ వైపు తిప్పుకునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..