ఆక్యుపెన్సీ సర్టిఫికెట్.. ఓసీ ఇది రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత కీలకమైన సర్టిఫికెట్. ఇది లేకపోతే భవనాల్లో ఉండటానికి నిబంధనలు ఒప్పకోవు. అంతే కాదు.. ఈ సర్టిపికెట్ లేకుండా నివాసం ఉంటే.. స్థానిక సంస్థలు సీజ్ చేయవచ్చు. బ్యాంకులు లోన్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను అడుగుతాయి.
అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అంటే ఏమిటి ?
నిబంధనల ప్రకారమే.. అనుమతి తీసుకున్న ప్లాన్ ప్రకారమే నిర్మించారని స్థానిక సంస్థలు జారీ చేసే ధ్రువపత్రమే ఆక్యుపెన్స సర్టిఫికెట్. మొదట ప్లాన్ అప్రూవల్ పొందిన తర్వాత బిల్డర్ ఇంటి నిర్మాణం చేసుకుంటారు. తర్వాత ఫ్లాట్లు చేసి అమ్ముకుంటారు. అయితే అందులో ఉండాలంటే.. బిల్డర్ ఖచ్చితంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను తీసుకొచ్చి ఇవ్వాలి. స్థానిక సంస్థల్లో దరఖాస్తు చేసుకుంటే.. అంతా సరిగ్గా ఉందని వారు నిర్దారించి.. సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇది వస్తే అన్నీ నిబంధనల ప్రకారం ఉన్నాయని అర్థం.
ఓసీ ఉంటే.. నిశ్చింత !
ఇప్పుడన్నీ భారీ అపార్టుమెంట్లే.. అందుకే బిల్డర్ ఖచ్చితంగా నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం కట్టకపోతే ఓసీ ఇవ్వరు. అందుకే బ్యాంకులు కూడా నిర్మాణం పూర్తయిన ఇళ్లకు లోన్లు ఇవ్వాలంటే ఓసీ అడుగుతాయి. ఈ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఇల్లు కొన్నప్పుడు బిల్డర్ దగ్గర నుంచి తీసుకోవాల్సింది. ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత బిల్డర్ దేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది.
పాత ఇళ్లకు అవసరమా ?
అయితే చాలా కాలనీల్లో పాత ఇళ్లు ఉంటాయి. నూటికి 90 శాతం వాటికి ఆక్యుపెన్స సర్టిఫికెట్ ఉండదు. అన్నింటికీ అవసరం లేదు. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇంటి పన్నులు కడుతూంటే.. అన్ని సక్రమంగా ఉన్నాయని అధికారులు చూసే ఇంటి పన్ను విధించారని అనుకోవచ్చు. కానీ కొత్తగా కడుతున్న ఇళ్ల విషయంలో మాత్రం .. ఓసీ ఖచ్చితంగా తీసుకోవాలి. నిర్లక్ష్ష్యం చూపకుడదు.