తెలుగువాడికి సినిమా అంటే వినోదం మాత్రమే కాదు. అదో ఎమోషనల్ ఫీలింగ్. తమకు నచ్చిన హీరోలను దేవుళ్లుగా ఆరాధిస్తుంటారు అభిమానులు. ఆ ప్రేమ, అభిమానాలను దేనితోనూ కొనలేం. ఇంక దేనితోనూ కొలవలేం. నిండా ఇరవై ఏళ్లు నిండని ఓ కుర్రాడు, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ చావు బతుకుల్లో ఉన్నాడు. తన చివరి కోరిక ఏమిటో తెలుసా? ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కళ్లారా చూడాలని. అందుకే ‘దేవర’ విడుదలైనంత వరకైనా నన్ను కాపాడండి`’అంటూ వైద్యుల్ని ప్రాధేయపడుతున్నాడు.
తిరుపతిలో ఉండే..కౌశిక్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. చిన్నప్పటి నుంచీ ఎన్టీఆర్ ని తన దేవుడిగా కొలుస్తున్నాడు. గత కొంతకాలంగా బోన్ కాన్సర్ తో పోరాడుతున్నాడు. డాక్టర్లు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారు. కౌశిక్ ది దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆసుపత్రి ఖర్చులు భరించడం వాళ్ల వల్ల కావడం లేదు. ఆపరేషన్ కు దాదాపుగా 60 లక్షలు ఖర్చవుతాయి. వాటిని పోగేయడం ఎలాగో తెలీక నానా అవస్థలూ పడుతోంది కౌశిక్ కుటుంబం. తను బతకడన్న విషయం కౌశిక్ కూ అర్థమవుతోంది. అయితే కనీసం దేవర విడుదలయ్యేంత వరకూ తనని బతికించాలని, తెరపై ఎన్టీఆర్ ని చూసి ప్రశాంతంగా చనిపోతానని డాక్టర్లతో కౌశిక్ అనడం, వాళ్లని ప్రాధేయ పడడం హృదయాల్ని కలిచి వేస్తోంది. ఈ విషయం తెలుసుకొన్న స్థానిక ఎన్టీఆర్ అభిమానులు కౌశిక్ ఆపరేషన్ ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తున్నారు. తన అభిమానులు చావు బతుకుల మధ్య ఉన్నాడని తెలిస్తే ఎన్టీఆర్ తప్పక ఆదుకొంటాడన్నది ఫ్యాన్స్ నమ్మకం. అందుకే ఎన్టీఆర్ కు అభిమాని కోరిక చేరేలా వాళ్ల వంతు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.