ఒకప్పుడు నేరుగా ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసేవారు. ఇప్పుడు అంతా ఆన్ లైన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ దోపిడీ. అసలు వాళ్లకు మన సమాచారం ఎలా తెలుస్తుందో అదే పెద్ద మిస్టరీ. ఈ దేశంలో దేనికీ భద్రత లేదని ఈ ఆన్ లైన్ ఫ్రాడ్స్ ద్వారా తేలిపోతుంది. కొన్ని లక్షల మంది వేల కోట్లు నష్టపోతున్నారని లెక్కలు చెబుతున్నారు కానీ కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం జీరో. ప్రజల్ని ఎవరు రక్షిస్తారు ?
పార్శిల్స్ , ప్యాకేజీల పేరుతో ఈడీ పేరుతో దోపిడీలు
మీకు ఓ పార్శిల్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయని ఒకడు ఫోన్ చేస్తాడు. అక్కడే పెద్ద డ్రామా. ముంబై పోలీసులంటారు.. ఎక్సైజ్ అంటారు.. యాంటీ డ్రగ్స్ అంటారు. ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అకౌంట్లలో ఎంత ఉన్నాయో అంతా ట్రాన్స్ ఫర్ చేయించుకుంటారు. ఈ మోసాల్లో ఎక్కువగా పెద్ద వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. పొరపాటున భయపడినట్లుగా అనిపించారా… వాళ్ల పీఎఫ్ అకౌంట్లు సహా మొత్తం నాకేస్తారు. బయట ఎవరికి చెప్పనీయకుండా డిజిటల్ అరెస్టు పేరుతో భయపెడారు. పార్శిల్ అనే కాదు.. మీ అకౌంట్లో మాఫియా డబ్బులు పడ్డాయని.. అదనీ ఇదనీ … ఫోన్ల తో మోసం మోసం వారి సంఖ్య లెక్కలేదు.. మోసపోయేవాళ్ల సంఖ్య కూడా లెక్కే లేదు.
అసలు మన సమాచారం సైబర్ నేరగాళ్లకు ఎలా వెళ్తుంది ?
మన ఫోన్ నెంబర్ మనం చెబితే తప్ప వేరే వాళ్లకు తెలియదు, అలాంటిది మన ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు, క్రెడిట్ కార్డు నెంబర్లు ఇలా సమస్త సమాచారం ఫ్రాడ్ స్టర్ల దగ్గర ఉంటుంది. అందుకే సెలెక్టివ్ గా ఫోన్లు చేస్తున్నారు. అకౌంట్లలో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకుని మరీ కాల్ చేస్తున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైనా వాట్సాప్ లో ఎవరితోనైనా ఏదైనా ప్యాకేజీ అమెజాన్ లేదా మరో డెలివరీ గురించి మాట్లాడిన కాసేపట్లో ఫ్రాడ్ స్టర్ నుంచి కాల్ వస్తుంది. అది మనం వెదుకుతున్న ప్యాకేజీనేమో అనుకుంటాం. అంత ఫాస్ట్ గా డేటాను సేకరిస్తున్నరు. అసలు ఇదంతా వారికి ఎలా చేరుతుందనేది ఇక్కడి ఎవరికీ అర్థం కాని విషయం. అంటే మన డేటాను కూడా అమ్ముకునే దొంగులున్నారన్నమాట.
ఈ కాల్స్ కట్టడి చేయడం పెద్ద పనా ?
సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తే.. ఫోన్ లిఫ్ట్ చేయవద్దని హెచ్చరించడం కన్నా.. అసలు డేటా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే సమస్య ఉండదు. ప్రతి ఫోన్ నెంబర్ పై నిఘా పెట్టలేకపోవచ్చు కానీ ఇలాంటి వ్యవస్థీకృత నేరాలు చేసే వారిపై వ్యవస్థలకు స్పష్టమైన అవగాహన ఉంటుది. ఇలాంటి వాటిని ఆపడం.. మన వ్యవస్థలకు చిన్న పని. ఎందుకంటే ప్రతి ఒక్క మొబైల్ సిమ్.. కు అధార్ అనుసంధానమై ఉంటుంది. అయినా కట్టడి చేయలేకపోతున్నారంటే.. సైబర్ దోపిడీ దార్లకు గట్టి మద్దతు ఉన్నట్లే. ప్రజల్ని దోచుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లే. దీన్ని నివారించకపోతే ప్రభుత్వాలు ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే.