బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6500 కోట్లు పెట్టుబడి పెట్టాలని ఇన్వెస్టర్లను కోరింది. మరీ ఆరు వేల ఐదు వందల కోట్లా… ఇంద తీసుకోండి అని ఇన్వెస్టర్లు ఏకంగా రూ. మూడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు ఇచ్చారు. ఇస్తామని ముందుకు రావడం కాదు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ మూడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు బజాజ్ ఫైనాన్స్ ఖాతాల్లో ఉన్నాయి. షేర్లు అలాట్ చేసిన తర్వాత… అలాట్ కాని వారి డబ్బును తిరిగిచ్చేస్తారు. ఈ రెస్పాన్స్ చూసి.. బజాజ్ పై ఇంత నమ్మకం ఎలా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దేశంలోని ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు ఐపీవోలకు వచ్చాయి కానీ.. ఇలా ఏకంగా 63.61 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ కావడం అసాధారణం. ఆ కంపెనీపై అంత నమ్మకం ఎలా అనేది చాలా మందికి వండర్ అనిపించవచ్చు కానీ.. బజాజ్ ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకున్న ప్రతి ఒక్కడికి లేదా అప్పు తీసుకున్న వారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. బజాన్ ఫైనాన్స్ .. అప్పులు ఎలా ఇస్తుందో వసూలు చేసుకునే విషయంలోనూ అలాగే ఉంటుంది. అందుకే హౌసింగ్ ఫైనాన్స్ కోసం ఐపీవోకి వచ్చినా .. అంతా ఆ తాను ముక్కే కాబట్టి.. ముక్కు పిండి అయినా భారీగా వడ్డీలు వసూలు చేసి లాభాలను ఆర్జిస్తుందని.. షేర్ వాల్యూ ఊహించనంతగా పెరుగుతుందని డిసైడయ్యారు. అందుకే ఆ స్పందన వచ్చింది.
బజాజ్ ఎలక్ట్రానిక్ అనే షోరూములు చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అమ్ముకోవడం వారి ప్రధాన వ్యాపారం కాదు. మధ్యతరగతి వారికి అప్పులిచ్చి ఈఎంఐలు పిండుకోవడమే వ్యాపారం. రెండు విధాలుగా లాభం. అన్ని వ్యాపారాల్లోనూ అలా రాలేదు కాబట్టి చిన్న చిన్న దుకాణాలతోనూ ఒప్పందాలు చేసుకున్న అప్పులిస్తోంది. కట్టకపోతే వారు ఎలా వసూలు చేసుకోవాలో అలా చేసుకుంటారు. ఈ విషయంలో బజాజ్ ఫైనాన్స్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కానీ వ్యాపారం.. వ్యాపారమే !