సొంతంగా స్థలం కొని అన్ని పర్మిషన్లు తీసుకుని ఇల్లు కట్టుకోవాలంటే పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే గతంలో ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు. కానీ అంతా వ్యాపారమయం అయిపోతున్న దశలో.. రెడీమేడ్ గా ఇళ్లు కట్టించే రియల్ వ్యాపారులు.. వాటిని కొనేవారు పెరిగిపోయారు. అయితే అది ఇల్లు. ఆషామాషీగా కట్టేస్తే కొన్నవారు … సమస్యలు వస్తే భరించలేరు. అందుకే రెరా అనేవ్యవస్థను ఏర్పాటు చేసి వినియోగదారులకు హక్కులు కల్పించారు. ఈ రెరా రూల్స్ ప్రకారం.. బిల్డర్ ఇల్లు అమ్మేసిన ఐదేళ్ల వరకూ నిర్మాణ లోపాలు తలెత్తితే బాధ్యత వహించాల్సిందే.
ఇల్లు అమ్మేసిన తరవాత తలెత్తే నిర్మాణపరమైన లోపాలకు బిల్డర్ల నుంచి స్పందన రాదు. లాభాలు పెంచుకోవడానికి చీప్ మెటీరియల్ వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. అమ్మేసిన తర్వాత కూడా నిర్మాణ లోపాలకు బాధ్యత వహించేలా చేయాలని రెరా నిర్ణయించింది. ఇందులో భాగంగా రెసిడెంట్స్ అసోసియేషన్ ఏర్పడి, కొనుగోలుదారులకు ప్రాజెక్టు అప్పగించిన తర్వాత ఐదేళ్ల పాటు నిర్మాణపరమైన లోపాలను పరిష్కరించే బాధ్యత బిల్డర్దేనని రెరా స్పష్టం చేస్తోంది.
నీళ్లు లీకవడం దగ్గర నుంచి చీప్ క్వాలిటీ టైల్స్ వాడటం వరకూ అనేక సమస్యలు వస్తాయి. లక్షలు పెట్టి ఇల్లు కొన్నవారు వెంట వెంటనే రిపేర్లకు మళ్లీ డబ్బులు పెట్టడం తలకు మించన భారం. అందుకే ఐదేళ్ల లోపు నిర్మాణలోపాలు తలెత్తితే బిల్డర్ ను సంప్రదించాలి. ఆయన స్పందించకపోతే రెరాను సంప్రదించవచ్చు.