Mathu Vadalara 2 Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్-
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మత్తువదలరా’ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఊహించని విధంగా హిట్ అయ్యింది. శ్రీసింహకి మంచి బిగినింగ్ ఇచ్చింది. సత్యని స్టార్ కమెడియన్ గా మార్చిన సినిమా అది. అటు దర్శకుడు రితేష్ రానా తన మార్క్ ని చాటాడు. మళ్ళీ అదే టీం కలసి మత్తువదలరా 2ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మరి పార్ట్ 2లో హిట్ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? ఈ సెకండ్ డోస్ ఎలాంటి కిక్కించింది?
బాబు(శ్రీసింహ), యేసు(సత్య) హీ టీంలో స్పెషల్ ఏజెంట్స్. కిడ్నాప్ కేసుల్ని డీల్ చేస్తుంటారు. ఆ సంస్థ ఇచ్చే జీతం దేనికీ సరిపోదు. కేసుని చేధించే క్రమంలో కిడ్నాపర్స్ ని తెలివిగా పట్టుకొని వాళ్ళు డిమాండ్ చేసిన దాంట్లో కొంత డబ్బుని నొక్కేస్తుంటారు. తమ పిల్లల ప్రాణాలు కంటే డబ్బు ముఖ్యం కాదని బాధితులు, అధికారులు భావించడంతో వారి దందా అడ్డులేకుండా సాగుతుంది. అయితే ఎన్ని కేసులు సాల్వ్ చేసిన వారి డబ్బు కష్టాలు తీరవు. ఇలాంటి సమయంలో ఓ పెద్దింటి కిడ్నాప్ కేసు వాళ్ళ చేతికి వస్తుంది. కిడ్నాపర్ రెండు కోట్లు డిమాండ్ చేస్తాడు. ఈ కేసుని హీ టీంతో సంబంధం లేకుండా డీల్ చేసి ఆ డబ్బుతో సెటిల్ అయిపోవాలని అనుకుంటారు. ఆ కేసు కోసం రంగంలో దిగిన బాబు, యేసు అనూహ్యంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. తర్వాత ఏం జరిగింది? ఆ మర్డర్ వెనుక వున్నది ఎవరు? ఈ కేసు నుంచి బాబు, యేసు ఎలా బయటపడ్డారనే మిగతా కథ.
ఈ మధ్య సీక్వెల్స్ ని ‘డెజావు’ ట్రీట్మెంట్ తో రాసుకుంటున్నారు. అంటే ఫస్ట్ పార్ట్ లో జరిగినట్లే సీన్స్ పునరావృతం అవుతుంటాయి. ‘డీజే టిల్లు 2’ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అదే స్టయిల్ లో ‘మత్తువదలరా 2’ని తీర్చిదిద్దారు. ఈ ‘డెజావు’ ట్రీట్మెంట్ చాలా చోట్ల వర్క్ అవుట్ అయ్యింది. డెలివరీ ఏజెంట్స్ గా వున్న బాబు, యేసు హీ టీంలోకి ఎలా వచ్చారో చూపిస్తూ కథ మొదలుతుంది. ప్రారంభ సన్నివేశాలు పార్ట్1ని రీక్యాప్ చేస్తాయి. అక్కడి నుంచే తేజస్వి తోట (అజయ్) పాత్రని తీసుకొని దానికో బ్యాక్ స్టొరీ ఇవ్వడం బావుంది. బాబు, యేసు పాత్రలని పరిచయం చేసే కిడ్నాప్ సీక్వెన్స్ నవ్వులు పంచుతుంది.
కర్మ పబ్ లో వచ్చే సీక్వెన్స్ ఈ కథలో చాలా కీలకం. ఫన్ కోసం ఆ సీన్ క్రియేట్ చేసినట్లు మొదట్లో అనిపించినా.. అక్కడే అసలు కథకి బీజం పడుతుంది. ‘స్లేవ్ డ్రగ్’ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీక్వెన్స్, తర్వాత ఝాన్సీ ఎంట్రీ, కిడ్నాప్.. ఇవన్నీ చకచకగా జరిగిపోతుంటాయి. అయితే ఇంత రేసీ నరేషన్ లో కామెడీ చేయడం అంత ఈజీ కాదు. కానీ సత్య తన టైమింగ్ తో భలే ఎంటర్ టైన్ చేశాడు. కర్మ పబ్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం, గ్రీన్ టీ సీన్.. థియేటర్ ఘోల్లున నవ్వేలా చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నిజంగా ‘ఊ..’ మూమెంట్.
పార్క్ వ్యూ హోటల్ కి షిఫ్ట్ అయిన తర్వాత కథ ‘డెజావు’ టర్న్ తీసుకుంటుంది. పార్ట్ వన్ లానే ఒక మర్డర్ వెనుక వున్న ఒకొక్క లేయర్ బయటపడుతుంటుంది. వెన్నెల కిషోర్ ఎపిసోడ్ బావునప్పటికీ.. ఆ ప్రీరిలీజ్ ఈవెంట్ ని మరీ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు వున్నాయి. కానీ ట్విస్ట్ లు రివిల్ అయిన విధానం అంత ఎక్సయిటింగ్ గా వుండవు. ప్రతి క్యారెక్టర్ తాము ఏం చేశామో వివరించుకుంటూ వెళ్ళిపోవడం అంత థ్రిల్లింగ్ గా అనిపించదు. అయితే క్లైమాక్స్ ‘స్లేవ్ డ్రగ్’ని హిలేరియస్ గా వాడారు. అక్కడ సత్య మరోసారి విజృంభించాడు. చిరంజీవి పదహారేళ్ళ వయసు పాట భలే పేలింది. పార్ట్ 3 కి అవకాశం వున్నట్టుగానే కథ ముగుస్తుంది.
శ్రీసింహ సత్య ల కెమిస్ట్రీ మరోసారి వర్క్ అవుట్ అయ్యింది. శ్రీసింహా ఈ పార్ట్ లో ఇంకాస్త యాక్టివ్ గా కనిపించాడు. దర్శకుడు సింహకి ఇచ్చిన ‘స్లీపింగ్ బ్యూటీ’ ట్యాగ్ కి న్యాయం చేస్తూ డిజైన్ చేసిన ఓ సీన్ హిలేరియస్ గా వుంటుంది. ఇక సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా సీన్స్ లో చెలరేగిపోయాడు. రైటింగ్ వీక్ గా వుండే సీన్స్ లో కూడా తన మార్క్ తో నెట్టుకొచ్చాడు. ఫరియా కొత్తగా యాడ్ అయ్యింది. తనది యాక్షన్ క్యారెక్టర్. చివర్లో కాసేపు సస్పెన్స్ కూడా క్రియేట్ చేసింది. సునీల్ సీరియస్ లుక్స్ లో కనిపించాడు. యూత్ స్టార్ వెన్నెల కిషోర్ కాసేపు అలరిస్తాడు. రోహిణీ పాత్ర కూడా కీలకమే. గుండు సుదర్శన్ పార్ట్ 1ని గుర్తుకు తెస్తారు. పార్ట్ 1 సీరియల్ పెద్ద హిట్టు. కానీ 2 లో అది అంత ఆర్గానిక్ గా కుదరలేదనిపించింది.
కథకి సరిపడా బీజీఎం వినిపిస్తుంది. కొన్ని సీన్లు మ్యూజిక్ తోనే ఎలివేట్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా వున్నాయి. డైరెక్టర్ రితిష్ రానా దగ్గర మంచి సెటైర్ కళ వుంది. తను రాసే డైలాగ్స్ లోనే కాదు, డిటేయిలింగ్ లోనూ హ్యుమర్ వుంది. మత్తువదలరా నచ్చిన ఆడియన్స్ కి ఈ పార్ట్ 2 కూడా నచ్చేస్తుంది.
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్-