అరికపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ తీవ్ర ఇరకాటంలో పడింది. ప్రాంతీయ వాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకురావడంతో హైదరాబాద్ లో ఉంటోన్న ఆంధ్రా సెటిలర్ల మనసును చివుక్కుమనేలా చేశాయి. వీటిపై బీఆర్ఎస్ అధినాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ లు రావడంతో బీఆర్ఎస్ నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సెటిలర్లను తమ నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అసలు ఇందులో కాంగ్రెస్ చేసిన కుట్ర ఏమిటన్నది ఎవరికీ అర్థం కాలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఏనాడూ సెటిలర్లకు ఇబ్బందులు కలగలేదని.. ఏపీ వాళ్ళంటే బీఆర్ఎస్ కు అపారమైన గౌరవం ఉందని గొప్పగా చెప్పుకున్నారు కౌశిక్ రెడ్డి. కానీ, అధికారం కోల్పోయాక ఈ ప్రాంతీయ వాదాన్ని కొత్తగా ఎందుకు తెరమీదకు తీసుకొచ్చారు అన్నది పాయింట్. ఇప్పుడు ఇదే విషయంపై బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తోంది కాంగ్రెస్.
కౌశిక్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అరికపూడి గాంధీని కృష్ణా జిల్లా నుంచి బతకడానికి తెలంగాణకు వచ్చావు అంటూ అవమానించారు. ప్రాంతీయవాదంతో గాంధీని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి.. తమకు సెటిలర్లపై గౌరవం ఉందని తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను గ్రేటర్ లో చావు దెబ్బ తీసేలా ఉన్నాయని గ్రహించే..తాజాగా శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను చేసిన వ్యాఖ్యలు గాంధీని మాత్రమే ఉద్దేశించినవి అని చెప్పుకొచ్చారని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.